నూతన ప్రభుత్వంలోనైనా ప్రజాసమస్యలు పరిష్కరించాలి : ఐద్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి

ప్రజాశక్తి – భట్టిప్రోలు
స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో వివిధ సంఘాల నాయకులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐద్వ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు వివరించారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ తీసుకోవాల్సిన చర్యలు, ఆయా రంగాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. గ్రామాల్లో జగనన్న కాలనీలో కనీస మౌలిక వసతులైన రహదారులు లేక లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేకపోయారని అన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు తగిన కార్యచరణ రూపొందించాలని అన్నారు. పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన గ్రామాల్లో తగిన సిబ్బందిని నియమించాలని అన్నారు. సిబ్బందికి అందాల్సిన అల వెన్సులు సకాలంలో విడుదల అయ్యే విధంగా చర్యలు చేపట్టేందుకు భవిష్యత్తు కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని సూచించారు. టైరు బండ్ల యజమానులు నిరంతరం ఇసుకరీచుల నుండి ఇసుక తీసుకొని విక్రయించుకునే విధంగా ప్రభుత్వ తగిన వ్యసులుబాటు కల్పించాలని, ఆటంకాలు తొలగించే విధంగా అధికారులకు విన్నవించాల్సిన ఆవశ్యకత ఉందని సమావేశంలో చర్చించారు. రైతులకు సకాలంలో ఎరువులు, పురుగు మందులు అందే విధంగా చూడాలని అన్నారు. కౌలుదారులకు కౌల గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు సకాలంలో విడుదల చేసే విధంగా సంబంధిత అధికారులను కోరారు. అంగన్‌వాడీ కార్యకర్తలు 43 రోజులపాటు ధర్నా చేసినప్పటికీ గత ప్రభుత్వం ఎలాంటి వేతనాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వమైన వేతనాలు పెంచాల్సి ఉందని అన్నారు. అందుకు తగ్గట్లు అంగన్‌వాడీల కార్యాచరణ ఉండాలని కోరారు. ఆశా కార్యకర్తల సమస్యలపై తగిన విధంగా ప్రభుత్వం స్పందించేందుకు మన వంతు కృషి చేస్తామని అన్నారు. అనేక గ్రామాల్లో స్మశాన వాటికల సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. గ్రామాల్లో మురుగు నీటి పారుదల లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రహదారుల అభివృద్ధి వంటి అనేక సమస్యలపై ప్రజా సంఘాలు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి తీర్మానించారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంతోనే ప్రజలు ఆ పార్టీని ఓడించారని గుర్తు చేశారు. ప్రస్తుత నూతన ప్రభుత్వం ఇచ్చిన హామీలను, రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధిని ముందుకు కొనసాగిస్తేనే మనుగడ సాగుతుందని అన్నారు. లేదంటే గత ప్రభుత్వానికి పట్టిన దుస్థితి ఈ ప్రభుత్వానికి కూడా పట్టక తప్పదని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం వేదిక కావాలని రమాదేవి సూచించారు. ప్రజాసంఘాల నాయకులు ఐక్యతతో ఉండి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్, ఎస్ఎఫ్ఐ నాయకులు పి మనోజ్, చేనేత నాయకులు బట్టు నాగమల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు నిర్మల, అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు చీకటి దుర్గ, కౌలు రైతు సంఘం నాయకులు పి అహరోను, టైరు బండ్ల యజమానుల యూనియన్ నాయకులు శంకర్రావు పాల్గొన్నారు.

➡️