ఎరువుల డీలర్లు నిబంధనలు పాటించాలి : సహాయ వ్యవసాయ సంచాలకులు సయ్యద్ అక్తర్ హుస్సేన్

Jun 11,2024 22:52 ##Repalle #Agriculture

ప్రజాశక్తి – రేపల్లె
ఎరువుల డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించి విక్రయాలు చేయాలని ఎడిఎ సయ్యద్ అక్తర్ హుస్సేన్ సూచించారు. మండలంలోని మార్కెట్ యార్డ్ నందు ఎరువుల డీలర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డీలర్లు అందరూ ఎరువులకు సంబంధించిన అన్ని స్టాప్ రిపోర్టర్లు, గ్రౌండ్ బ్యాలెన్స్ టాలీ అవ్వాలని అన్నారు. చలానా చెల్లించని వాళ్లు చెల్లించాలని చెప్పారు. రైతులకు సంబంధిత విస్తీర్ణం బట్టి ఎరువులు ఇవ్వాలని చెప్పారు. సంబంధిత డీలర్లు స్టాక్ రిపోర్ట్ మార్చి 31 లోపు చెల్లించాలని అన్నారు. సకాలంలో ఎరువులు స్టాక్ రిజిస్టరును యాక్టివేషన్‌ చేయించుకోవాలని అన్నారు. ప్రతి దుకాణం వద్ద ఖచ్చితంగా ధరల పట్టికలు ప్రదర్శించాలని చెప్పారు. ఎమ్మార్పీకే ఉత్పత్తులు విక్రయించాలని అన్నారు. విక్రయాలకు సంబంధించిన రసీదులు అందజేయాలని చెప్పారు. ఎరువులు, పురుగు మందులకు దూరంగా విత్తనాల స్టాకు నిల్వ చేసుకోవాలని సూచించారు. రైతులకు ఏ నష్టం కల్పించినా, మోసం చేసిన డీలర్లపై కేసు నమోదు చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి ఆర్ విజయ్ బాబు మాట్లాడుతూ ప్రతి రైతు వారి పొలంలో భూసార పరీక్షలు తప్పని సరిగా చేయించుకోవాలని అన్నారు. భూసార పరీక్షల వల్ల భూమిలోని పోషక విలువలు తెలియడం తోపాటు పంటల దిగుబడులకు అవసరమైన ఎరువులను ఏ మోతాదులో వాడాలో రైతులు తెలుసుకోవడానికి వీలు కలుగుతుందని అన్నారు. తద్వారా పంటల సాగు ఖర్చులు కూడా తగ్గుతాయని అన్నారు. పచ్చిరొట్ట పైర్లైన పిల్లిపెసర, జనుము, జీలుగ దుక్కుల అనంతరం పచ్చిరొట్ట పైర్లుగా పొలంలో వేయడం వల్ల భూసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయని సూచించారు. ఖరీఫ్ సీజన్లో పండించే వరికి, రబీ సీజన్లో పండించే మినుము, పెసర, మొక్కజొన్న, తెల్లజొన్న వంటల్లో చీడపీడలను తట్టుకునే శక్తి ఈ పచ్చిరొట్ట పైర్లు వేసిన పొలాల్లో ఏక్కువగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వాగోలు బుష్, వ్యవసాయ అధికారులు, ఎరువుల దుకాణాల డీలర్లు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

➡️