– ప్రమాదంలో 9ఇళ్లు దగ్దం
– కట్టుబట్టలతో మిగిలిన గిరిజనులు
– తక్షణ సహాయం అందజేసిన ఎంఎల్‌ఎ, కలెక్టర్
ప్రజాశక్తి – కర్లపాలెం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగి తొమ్మిది ఇళ్లు దగ్దమైన సంఘటన స్థానిక లంక కాలువ కట్టపై సోమవారం జరిగింది. లంక కాలువ కట్టపై గిరిజనులు నివశిస్తున్నారు. సోమవారం యధావిధిగా పనులు నిమిత్తం బయటకు వెళ్లగా ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వచ్చి ఇళ్లు ఒకదానికి ఒకటి వెంట వెంటనే అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ జె వెంకట మురళి సంఘటన స్థలానికి చేరుకొని దగ్దమైన ఇళ్ల బాధితులకు అన్నీ సదుపాయాలతో త్వరలో పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగినప్పుడు బాధితులు కూలి పనులకు వెళ్లి ఉన్నందువల్ల ఘటనస్థలిలో ఎవరు లేరని బాధితులు తెలిపారు. ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే నిత్యవసర వస్తువులు అందజేసి భోజన ఏర్పాట్లు చేసి ప్రతి కుటుంబానికి రూ.5వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం కలెక్టర్ అందజేశారు. ప్రమాద విషయాన్ని వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి రూ.40వేలు వచ్చే విధంగా ఆర్థిక సహాయం అందిస్తామని, ప్రభుత్వం తరఫున రూ.4లక్షలతో మౌలిక సదుపాయాలతో కూడిన పక్కా ఇల్లు నిర్మించి ఇచేస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ బి సుబ్బారావు, ఆర్డీఓ రవీందర్, తహశీల్దారు వెంకటరత్నం, ఎస్‌ఐ రవీంద్ర, విఆర్ఓ ఉన్నారు.
ఎంఎల్‌ఎ నరేంద్రవర్మ పరామర్శ
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇళ్లు దగ్దమైన సంఘటన తెలుసుకున్న ఎంఎల్‌ఎ వేగేశన నరేంద్ర వర్మ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. తక్షణ సహాయంగా రూ.10వేలు అందజేశారు. ప్రభుత్వ పరంగా అన్ని అందే విధంగా కృషి చేస్తామని అన్నారు. అనంతరం రెడ్ క్రాస్ సభ్యులు నారాయణ బట్టు, ఇనకొల్లు పోలీసురావు బాధితులకు తాత్కాలిక గుడారాలు అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు భూపతిరావు, నక్కల వెంకట స్వామి, జడ్పీటీసీ వేణు గోపాలరెడ్డి, బాజి, వసంత్‌రెడ్డి, కట్టా సుజాత, కొండలు, ధనుంజయ్ పాల్గొన్నారు.