ఆకుకూరలతో ఆహారం ఆరోగ్యానికెంతో మేలు : సిడిపిఓ కృష్ణకుమారి

ప్రజాశక్తి – పంగులూరు
ఆకుకూరలతో తిన్న ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలని గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు నిత్యం ఆకుకూరలతో కలిసిన ఆహారాన్ని తీసుకోవాలని కొరిశపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ కృష్ణకుమారి అన్నారు. మండలంలోని అలవలపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలకు ఆమె ఆకుకూరలు విత్తనాలు మట్టితో కలిపి పంపిణీ చేశారు. గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలకు ఆయా సమయాల్లో పుష్టి కరమైన ఆహారం ఎంతో అవసరమని చెప్పారు. ఆకుకూరలతో తిన్న ఆహారంలో అనేక పోషక విలువలు అందుతాయని చెప్పారు. సీజనల్‌గా ఈ నెలలో బీర, పొట్లకాయ, కాకర, టమోట సాగు చేస్తుంటారని తెలిపారు. వీటితోపాటు ఆకుకూరలైన పాలకూర, తోటకూర విత్తనాలను సాగు చేస్తుంటారని అన్నారు. ఈ కూరలను ఆహారంలో తింటే మంచి ఆరోగ్యం లభిస్తుందని చెప్పారు. అందుకోసం ఆకు కూరల విత్తనాలను మట్టిలో కలిపి, ఉండలుగా చుట్టి గర్భిణీలు, బాలింతలకు ఇస్తున్నామని చెప్పారు. ఈ విత్తనాలను ఇళ్ల దగ్గర నాటుకొని మొక్కలు పెంచుకొని ఆ కూరగాయలు, ఆకుకూరలతో తినాలని చెప్పారు. ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను అందరికీ అందజేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యాలు బాగుంటేనే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని అన్నారు. పుట్టిన పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతారని అన్నారు. కిషోర బాలికలు రుతు చక్రం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ఆ సమయంలో వ్యక్తిగత శుభ్రతతో పాటు ఆరోగ్యవంతంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంగులూరు, ముప్పవరం సెక్టార్ల సూపర్వైజర్లు జయప్రద, పద్మజ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు పాల్గొన్నారు.

➡️