ప్రభుత్వ విధానాలతోనే చేనేతల ఆత్మహత్యలు

May 25,2024 00:36 ##Repalle #Chenetha

ప్రజాశక్తి – రేపల్లె
ప్రభుత్వాలు చేనేత పరిశ్రమ పట్ల అవలంభిస్తున్న విధానాల కారణంగా ఉపాధి లేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి గొట్టుముక్కల బాలాజీ ఆరోపించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకు పోయిందని అన్నారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు లేక అప్పుల పాలవుతున్నారని అన్నారు. చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు అప్పులు తీర్చే మార్గం లేక అర్దాకలితో బతుకు సాగిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపద్యంలో అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు చెందిన కుళ్ళాయప్ప (40) అనే చేనేత కార్మికుడు సోమవారం ఆత్మహత్య చేసుకోగా సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన చేనేత కార్మికుడు శీలా బాల చౌడయ్య (29) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని మృతి చెందాడని చెప్పారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూలు, రంగులు, రసాయనాలు, వస్త్రాలపై 47శాతం పన్ను విధించడంతో చేనేత వస్త్రాల అమ్మకాలు పడిపోయి కార్మికులకు పనిలేకుండా పోయిందన్నారు. ఆత్మహత్యలకు గురైన చేనేత కార్మిక కుటుంబాలకు రూ.50లక్షల వంతున ప్రభుత్వం ఆర్దిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కొడాలి రామ కోటేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు సిహెచ్ శివశంకర్ పాల్గొన్నారు.

➡️