ఆనవాలు కోల్పోతున్న చారిత్రక సాక్ష్యాలు

Jun 8,2024 23:47 ##Addanki

– రెడ్డి రాజులు పాలన నాటి కోట కట్ట మాయం
– గృహనిర్మాణాలతో కనుమరుగైన ఏనుగుల బావి
ప్రజాశక్తి – అద్దంకి
ఓ యాభై ఏళ్ల క్రితం వరకు పట్టణంలో ఏనుగుల బావి ఉండేది. ప్రస్తుతం అక్కడ ఒక ఇల్లు ఉన్నది. ప్రకాశం పంతులు బాల్యం కొంతకాలం అద్దంకిలో గడిచిందని, ఏనుగుల బావిలోకి తాను దిగడం, పిల్లలతో ఈత కొట్టడం విషయాన్ని ‘నా జీవన యాత్ర’ పుస్తకంలో ఆయన వ్రాసుకున్నారని చరిత్రకారులు, విశ్రాంత ఉపాధ్యాయులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి ప్రజాశక్తితో తన జ్ఞపకాలను పంచుకున్నారు. ఏనుగుల బావి అద్దంకి కోట దక్షిణ హద్దును ఆనుకుని ఉండేదని తెలిపారు. కోటలోని ఏనుగులు ఈ బావిలో దిగి నీళ్లు త్రాగుతాయట. కాబట్టే ఈ బావికి ఏనుగుల బావి అని పేరు వచ్చింది. ఈ ఏనుగుల బావి సరిగ్గా గవర్నమెంటు ఆసుపత్రి రోడ్డుకు తూర్పుగా, బాలాంజనేయస్వామికి ఎదురుగా ఉన్న స్థలంలో ఉండేది. ఈ కోట కట్టపైనే రావినూతల విశ్వనాథం మాష్టారు పాత ఇల్లు, స్వీటు షాపు, ఆలూరి వెంకటరావు ఇల్లు ఉన్నాయి. ప్రోలయ వేమారెడ్డి పరిపాలనలో అద్దంకి సువిశాల తెలుగు రాజ్యానికి రాజధాని. ఆయన పరిపాలనలో అద్దంకి గొప్ప వైభవాన్ని సంతరించుకుంది. అద్దంకి కోట చుట్టూ నూరు పాలేలు ఉండేవి. వాటి తోటి అద్దంకి అందాల నగరంగా వర్ధిల్లింది. ప్రతి పాలెం ఒక గుడితో శోభిల్లింది. ‘నూరు గుళ్ళు, నూరు బావులు లేడన్న వాడు గాడిదకడుపున పుడతాడనే’ గార్ధభ శాసనం అద్దంకిలో వెలిసింది. ఈ గ్రామాలన్ని కోటను రక్షించేవి. కోటలోని వారికి కావలసిన వన్నీ సమకూర్చేవి. ప్రోలయ వేమారెడ్డి తర్వాత వారు రాజధానిని కొండవీడుకు మార్చారు. అద్దంకి ఒక దుర్గంగా మాత్రమే మిగిలిపోయింది. రాయలు వారు తన దండయాత్రలో అద్దంకి దుర్గాన్ని కూడా సులభంగా వశం చేసుకున్నారు. దానికి సంబంధించిన ఒక చిన్నకథ ఏనుగుల బావితో ముడిపడి ఉంది. తిమ్మరుసు తెలివితేటలతో యుద్ధం చేయకుండానే అద్దంకి రాయల వారి వశమైంది. కొటికలపూడి యువతి కోటలోకి పాలు,పెరుగు తీసుకొని పోవడం గమనించిన తిమ్మరుసు ఆమెను భయపెట్టి కోటలోకి వెళ్ళే మార్గం తెలుసుకున్నారు. అదేమిటంటే కొటికలపూడి యువతి వెన్నముద్దను ఏనుగుల బావిలో వేసింది. అది సొరంగం ద్వారా గుళ్ళకమ్మలోకి చేరింది. ఏనుగుల బావిలోకి నీరు గుళ్ళకమ్మ ద్వారా చేరుతాయని తెలుసుకున్న తిమ్మరుసు, ఆ సొరంగమార్గం ద్వారా కోటలోనికి సైనికులతో ప్రవేశించి కోటను వశపరచుకున్నాడని పూర్వీకులు చెప్పేవారు. అందుచేత పెద్దగా యుద్ధం చేయకుండానే అద్దంకి దుర్గం రాయల వశమైంది. అద్దంకి కోటకట్ట చాలా ఎత్తుగా, చాలా విశాలంగా ఉండేది. ఇప్పటికి దాని గురుతులు పాతశివాలయం వెనుక, పాత తహశీల్దారు కార్యాలయం వాయువ్యభాగాన కనపడతాయి. కోట కట్టను చదును చేసి ఇళ్ళు కట్టుకున్నారు. కోటలోని పాటి మట్టిని ఇంటి గోడలకు వాడుకున్నారు. ఒక వందేళ్ళ కాలం కోటను మాయం చేసింది.
కోట కట్టపై కట్టుకున్న ఇళ్ళు మిగతా ఇళ్ళకంటే ఎత్తులో ఉండటం మనం గమనించవచ్చు. కోట కట్ట విస్తరించిన ప్రాంతం ఈ విధంగా ఉంది. పాతశివాలయం (రామలింగేశ్వరస్వామి గుడి) చుట్టుకుని, పాత తహశీల్దారు ఆఫీసుకు ఉత్తరం గోడ వైపుగాసాగి, ఆలూరి వెంకటరావు ఇంటి మీదుగా తూర్పుగా శంభుడు పంతులు బడి ప్రక్కగా, తూర్పుగా కొత్తపేట గుండా పోతురాజు గండిదాక సాగి, అక్కడి నుండి భవానీ టాకీసు (కోటకట్ట మీద కట్టబడినది), అటునుండి సాయిబ్బుల వీథికి దక్షిణంగా విస్తరించి (ఉత్తరపు కోటకట్ట), పడమట కట్ట క్రింద (కట్ట అంటే ఇక్కడ కోటకట్ట) పాలెంను ఆనుకుని చివరకు పాతశివాలయం చేరుతుంది. అంటే పాత శివాలయం, పోలేరమ్మ గుడి, వీరభద్ర స్వామి గుడి, బ్రహ్మంగారి గుడి మాత్రమే కోట లోపల ఉండే దేవాలయాలు. మిగిలిన దేవాలయాలు అద్దంకి కోటను చుట్టుకొని ఉన్న పాలేల్లో ఉన్నాయి. దామావారిపాలెంలో నరసింహస్వామి గుడి, వేయిస్థంభాల గుడి, కాకానిపాలెంలో వినాయకుని గుడి, కోదండ రామస్వామి గుడి, రంగనాయకుల స్వామి గుడి, వెంకటేశ్వరస్వామి గుడి, నంబూరివారిపాలెం ఆనుకొని కమఠేశ్వర స్వామి గుడి, ఆకులవారి మాన్యంలో మాధవస్వామి దేవాలయం ప్రముఖంగా కనపడతాయి. ప్రతి యేటా ఈ దేవాలయాల్లో అర్చక స్వాములు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు అద్దంకి నగరం వైకుంఠాన్ని తలపిస్తుంది భక్తజన సందోహాలతో అద్దంకిలోని దేవాలయాలు అన్నీ కళ కళలాడుతాని చరిత్రకారులు, విశ్రాంత ఉపాధ్యాయులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు.

➡️