ఆర్టీసీ బస్సులకు ఆదివారం సెలవు

Jun 10,2024 00:15 ##Panguluru #rtc

ప్రజాశక్తి – పంగులూరు
ఆర్టీసీ అధికారులు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం నడపాల్సిన బస్సులను వారి ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు. ప్రజల సౌకర్యం కోసం అవసరమైన రీతిలో బస్సులు నడపడంలేదు. ఆ రూట్లలో ఆర్టీసీ బస్సులకు సెలవు ఇవ్వడం ఆర్టీసీ అధికారులకు పరిపాటిగా మారింది. గ్రామీణ ప్రాంతంలో ప్రజలు అనేక అవసరాల కోసం ఆర్టీసీ బస్సులపై ఆధారపడి ప్రయాణం చేస్తుంటారు. అయితే ఆర్టీసీ అధికారులు ఇష్టం వచ్చిన రీతిలో నడపటం వల్ల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలే అరకోరగా నడుస్తున్న ఆర్టీసీ బస్సులను ఆదివారం వస్తే కొన్ని రూట్లలో ఆపేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రయాణికులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తుంది. దూర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు చేరుకోవలసిన ప్రయాణికులు ఆదివారం ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో నానా యాతన పడుతున్నారు. అద్దంకి ఆర్టీసీ డిపో పరిధిలో మైలవరం, మక్కినేనివారి పాలెం, బాపట్ల, తాళ్లూరు, చీరాల, రావినూతల, అద్దంకి నుండి అంబటిపూడి మీదగా వెళ్లే చిలకలూరిపేట బస్సు, అద్దంకి నుండి వైదన మీదుగా చిలకలూరిపేట వెళ్లే బస్సులను అధికారులు ప్రతి ఆదివారం నిలిపి వేస్తున్నారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించే ఈ బస్సుల్లో వ్యవసాయ కూలీలు నిత్యం పనులకు ఈ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. ఈ బస్సుల్లో దూరప్రాంతాలకు వెళుతుంటారు. ఆదివారం రోజు బస్సులు లేకపోవడం వలన కూలి పనులు వెళ్లలేకపోతున్నారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది పంగులూరు మండలంలోని జాగర్లమూడి వారిపాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు తాళ్లూరు ప్రాంతానికి ఆటోలో వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై ఇద్దరు మహిళా కూలీలు మరణించారు. అంతకు ముందు రెండు రోజుల క్రితం అద్దంకి మండలంలోని కలవకూరు సమీపంలో కూలీల ఆటో తిరగబడి ఒక మహిళ మరణించింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తూ కూలీలు అనేక సందర్భాల్లో మరణించడం, గాయాల పాలవడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సులు సకాలంలో ఉంటే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండటంతో పాటు ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా నివారించవచ్చని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు తక్షణమే రద్దు చేసిన ఏడు బస్సులను పునరుద్ధరించి ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

➡️