కూలీలకు మౌలిక వసతులు కల్పించాలి

Jun 8,2024 23:36 ##Karlapalem #nregs

ప్రజాశక్తి – కర్లపాలెం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మండలంలో పనిచేసే కూలీలకు ఎక్కువ రోజులు పని కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, కనీస వేతనం రోజుకు రూ.600 వచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు చేసే మండలంలోని పాత నందాయపాలెం, కొత్త నందాయపాలెం, యట్రాయవారిపాలెం గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పనులు పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఎక్కువ మందికి వంద రోజులు పని కల్పించాలని కోరారు. అయితే ఎవరికీ వంద రోజులు పని కల్పించడం లేదని కూలీలు తమ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో యంత్రాలు రావడం వల్ల వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే ఉపాధి హామీ పధకం పీడీ, మండల స్థాయి అధికారులు చొరవ చూపి పనులు కనిపించాలని కోరారు. లేనిపక్షంలో కూలీలతో కలిసి ఆందోళన చేస్తామని అన్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతున్న కనీస వేతనం పెరగక పోవడం దారుణమని అన్నారు. కేవలం రూ.300 లోపే ఇస్తున్నారని అన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో కూడా ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తున్నారని అన్నారు. పేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిధులు పెంచి ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలని కోరారు. గతంలో ఉపాధి కూలీలు ఇచ్చిన సౌకర్యాలను పునర్దించాలని అన్నారు. గతంలో పలుగు, పారా ఇచ్చే డబ్బులు, మేట్లకు ఇచ్చే డబ్బులు ఇవ్వాలని అన్నారు. రెండు పూట్ల ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. 200రోజులు పని కల్పించేందు కోసం కూలీలంతా ఐక్యంగా ఉండాలని, ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం కోసం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధి హామీ మేట్లు శ్రీనివాసరావు, శివ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

➡️