కర్రసాము కళను పరిరక్షించాలి : కనుమరుగవుతున్న ప్రాచీన కర్ర సాము కళ

Jun 10,2024 00:04 ##bapatla #selfdefence

ప్రజాశక్తి – బాపట్ల
పూర్వకాలంలో యుద్ధ కళల్లో ఒకటైన కర్రసాము నానాటికి అంతరించిపోతోంది. క్రీస్తు పూర్వం పుట్టిన కర్రసాము కళను నేటి పాలకులు పట్టించుకోవడం లేదు. క్రీడల్లో భాగమైన కర్రసాము కళను రేపటి తరానికి అందించాల్సిన అవసరాన్ని గుర్తించి కర్ర సామును పరిరక్షించి, ముందు తరాలకు అందించేందుకు సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో విద్యార్థులకు కర్రసాము పట్ల ఆసక్తిని పెంచేందుకు స్థానిక రైలుపేట కృష్ణ మందిరం వద్ద కర్ర సాము శిక్షణ ప్రారంభించారు. ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట భట్టు, కొలను మోహన్, పూసపాటి శ్రీకాంత్ పర్యవేక్షణలో కర్ర సాము శిక్షకుడు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన కందుల శివరాం ద్వారా చిన్నారులకు కర్ర సాములో శిక్షణ ఇస్తున్నారు. పాఠశాల సెలవుల్లో విద్యార్థులు, చిన్నారులకు కర్ర సాము పట్ల ఆసక్తి కల్పించేందుకు శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాపట్లలో శిక్షణ నిరంతరం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్థానిక ఎయిమ్ సదన్ వసతి గృహంలో అనాధ చిన్నారులకు ఉదయం, సాయంత్రం సమయాల్లో కర్రసాము శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులకు కర్ర సాము నేర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కర్ర సాముశిక్షణ ఇస్తున్న కందుల శివరాం తాతల కాలం నుండి వంశ పారంపర్యంగా కర్ర సాము విద్య నేర్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కర్ర సాముశిక్షకుడు శివరాం మాట్లాడారు. క్రీస్తు పూర్వమే కర్రసాము విద్య పుట్టిందని తెలిపారు. అప్పటి జీవన విధానం, అందుబాటులోని వనరుల ఆధారంగా శత్రువుల నుండి ఆత్మ రక్షణకు తమిళనాడులో కర్ర సాము పురుడు పోసుకుందని తెలిపారు. తమిళనాడులో అంకురించిన సంప్రదాయ కర్రసాము ప్రపంచ వ్యాప్తంగా పరిచయమైందని తెలిపారు. తమిళంలో దీన్ని ‘సిలంబం’ అని, తెలుగులో ‘తాలింకానా’ అని పిలిచేవారని తమ తాతలు చెప్పేవారని అన్నారు. కర్రలతో చేసే సాధనం కావడంతో కొన్నేళ్ల తరువాత ‘కర్రసాము’గా తెలుగులో ప్రసిద్ధి కెక్కిందని తెలిపారు. కాలక్రమేణా కర్రసాముకు యుద్ధ ప్రాముఖ్యత తగ్గిపోయిందని అన్నారు. నేటికీ ఈ కళ కొన్ని గ్రామాల్లో సజీవంగా ఉన్నప్పటికీ ప్రాధాన్యత లేకుండా పోయిందని పేర్కొన్నారు. అయితే నగర యువతకు ఈ విద్య గురించి పూర్తిగా అవగాహనలేదని అన్నారు. రేయింబవళ్లు పుస్తకాలకే పరిమితమైన విద్యార్థులు అనేక ప్రాచీన కళలను విస్మరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కర్రసాము ఔన్యత్యాన్ని పట్టణ, నగర యువతకు అవగాహన, ఆసక్తి కల్పించేందుకు కర్రసాము పేరుతో క్రీడా పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే బాపట్లలో సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్రసాము విద్యను విద్యార్థులు, చిన్నారులకు నేర్పిస్తున్నామని తెలిపారు. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు అధిక బరువు తగ్గడానికి, మడమలు, కీళ్లు, ఎముకల పటుత్వానికి, శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, ఏకాగ్రత పెంచేందుకు కర్ర సాము విద్య ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కర్ర సాము కళను పరిరక్షించేందుకు ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కర్ర సాము కళను ప్రోత్సహించాలని కోరారు. ఇదే కళను నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమ లాంటి వారికి ఉపాధి సమకూరుతుందని అన్నారు.

➡️