హత్య కేసులో నిందితులకు యావజ్జీవ శిక్ష

ప్రజాశక్తి – పర్చూరు
వివాహేతర సంబంధం నేపధ్యంలో జరిగిన హత్య కేసులో నింధితలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఒంగోలు పీడీజే కోర్టు న్యాయమూర్తి ఎ భారతి తీర్పు వెలువడించారు. నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసు అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. మండలంలోని చెరుకూరుకు చెందిన నవాబు గోపి నాగరాజు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గ్రామానికి చెందిన ఆరుద్ర సాంబశివరావు, హతుని భార్య నవాబు శివతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసి గ్రామ పెద్దలు ముద్దాయిలను మందలించారు. అప్పటి నుండి సాంబశివరావు హతుడు సురేష్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతనిని చంపాలని 2015ఫిబ్రవరి 2న రాత్రి 9గంటలకు చెరుకూరు గ్రామంలోని ఎన్టీఆర్ సెంటర్ వద్ద నడిచి వెళ్తున్న హతుడిని వెనుక నుండి కత్తితో దాడిచేసి తలపైన, గొంతుపైన నరకగా అక్కడికక్కడే మృతి చెందినాడు. ఈ ఘటనపై మృతుడు సురేష్‌ సోదరుడు నవాబు గోపి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ మాధవరావు కేసు నమోదు చేశారు. అప్పటి ఇంకొల్లు సిఐ ఎం శ్రీనివాసరావు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. సాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. భౌతిక సాక్ష్యాల ఆధారంగా నిందితులు నేరం చేసినారని నిరూపించి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిపుణుల నివేదికలను, భౌతిక సాక్ష్యాధారాలను ఒకదానితో ఒకటి సరిపోల్చుకొని సంబంధిత న్యాయస్థానంలో ముద్దాయిలపై అభియోగ పత్రం దాఖలు చేశారు. ఒంగోలు పీడీజే కోర్టులో విచారణకు రావడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మార్టూరు సిఐ సి సీతారామయ్య కేసు ట్రైల్‌ను పర్యవేక్షించారు. పర్చూరు ఎస్‌ఐ ఎస్ రమేష్, కోర్టు కానిస్టేబుల్ కిరణ్ కుమార్ సాక్షులు భయం లేకుండా నిర్భయంగా కోర్టులో సాక్ష్యం చెప్పే విధంగా తర్ఫీదు ఇచ్చారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు సరైన సమయంలో సాక్షులను న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. కోర్టు పిపి ఎన్ వసుంధర సరైన రీతిలో వాదనలు వినిపించారు. న్యాయమూర్తి ఎ భారతి ఇద్దరు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ మే 6న సోమవారం తీర్పు విలువరించినారు. హత్య కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా కృషిచేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని, కోర్ట్ మానిటరింగ్ సిబ్బందిని, పీపీని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అభినందించినారు.

➡️