ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తా : ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్

Mar 31,2024 23:55 ##MLA #Gottipati #Ravikumar

ప్రజాశక్తి – అద్దంకి
మండలంలోని మణికేశ్వరం గ్రామంలో ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ 2వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి, బాలత్రిపుర సుందరీ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఆయనకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిపారు. సంక్షేమం ముసుగులో ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. గ్రామాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత భవిష్యత్తు కోసం ప్రజలు ఆలోచించాలని కోరారు. అప్పులు చేసి కాకుండా సంపద సృష్టించి మరింత సంక్షేమాన్ని అందించే విధంగా ఉండాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి కార్యకర్తలు గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామమైన మణికేశ్వరం ఎస్సీ కాలనీవాసులకు ఐదేళ్లు గడుస్తున్నా నేటికీ నివేశన స్థలాలు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే నివేశ స్థలాలతో పాటు గృహాలను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సామాజిక సర్వేలో నమోదైనప్పుడు వారి వయసు 17 సంవత్సరాలు అయిటే నేడు వారికి వివాహమై పిల్లలు పుట్టి అదే ఇళ్లలో రెండు, మూడు కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం మేజరైన ప్రతి ఒక్కరికి నివేశ స్థలాలు అందేలా కృషి చేస్తానని అన్నారు. తాను చాలాసార్లు మణికేశ్వరం గ్రామంలోని శివాలయాన్ని దర్శించుకున్నానని, గుండ్లకమ్మ నదికి ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. టిడిపి కాలంలో చేపల వేట ద్వారా జీవనం సాగించే ఎస్సీ, ఎస్టీ జాలర్లలకు 90శాతం రాయితీపై మోపెడ్, మూడు చక్రాలు, నాలుగు చక్రాల వాహనాలను అందించి వారి జీవనాభివృద్ధికి తోడ్పాటు అందించామని గుర్తు చేశారు. అప్పట్లో ప్రభుత్వమే గుండ్లకమ్మ నదిలో చేప పిల్లలను విడుదల చేసి నిషేధ సమయంలో ఆర్థికంగా చేయూత అందించామని గుర్తు చేశారు. గుండ్లకమ్మలో నీరు లేని కారణంగా నేడు జాలర్ల దుస్థితి దారుణంగా ఉందన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి నాలుగేళ్లయినా మూడు గేట్లు పెట్టలేని అసమర్ధ ప్రభుత్వమని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలో గేట్లు ఏర్పాటు చేసి సాగునీరు, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని అన్నారు. గుండ్లకమ్మ నదిలో వందల ట్రాక్టర్ల ఇసుక అమ్ముకుని రూ.లక్షలు గడిస్తున్నారని అన్నారు. ఇసుక డ్రెజ్జర్ గుండ్లకమ్మ నది పరిధిలో ఉండడానికి వీల్లేదని, పొలాలు కోతకు గురవుతాయని, బోర్లలో నీరు ఇంకిపోతాదని హంగామా చేసిన నేతలు నేడు నదీ గర్భాన్ని గుల్ల చేస్తుంటే మిన్న కుండటం దేనికి సంకేతమో ప్రజలు ఆలోచించాలని కోరారు. తాము రైతులకు జలసిరి బోర్లు, సోలార్, విద్యుత్ కనెక్షన్లు అందించి వెన్నుదన్నుగా నిలిచామని అన్నారు. అర్హులైన వారందరికీ పార్టీలకతీతంగా చర్మ, డప్పు కళాకారులకు, వృద్ధాప్య, ఒంటరి మహిళ, వితంతు, వికలాంగ, మత్స్యకార పింఛన్లను మంజూరు చేశామన్నారు. మణికేశ్వరం గ్రామానికి దశాబ్దాలుగా రోడ్డు సరిగ్గా ఉండేది కాదని, టిడిపి ప్రభుత్వంలో పంచాయితీరాజ్‌ శాఖ మంత్రిగా లోకేష్ చొరవతో తారు రోడ్డు మంజూరు చేయించి నిర్మించామని గుర్తు చేశారు. సిఎం సహాయ నిధి ద్వారా పేదల వైద్యానికి ఆర్ధిక తోడ్పాటు అందించామని అన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమని అన్నారు.

➡️