ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా : ప్రజాశక్తితో ఎంఎల్‌ఎ ఎంఎం కొండయ్య

Jun 11,2024 23:15 ##Chirala #tdpnews #Kondaiah

ప్రజాశక్తి – చీరాల
ఎంఎల్‌ఎగా అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎంఎం కొండయ్య ప్రజాశక్తితో మాట్లాడారు. 20వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొందారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకానికి తగినట్లు విధేయునిగా పనిచేస్తానని అన్నారు. ప్రజాశక్తితో ఆయన మాటల్లో…
ప్ర. ఇంత భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం మీరెలా భావిస్తున్నారు?
కొండయ్య : ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో గెలిపించారు. మీరందరూ ఈ గెలుపును ఎలా ఆనందిస్తున్నారో నేను కూడా అలానే సంతోషిస్తున్నాను. చంద్రబాబుగారిపై అభిమానం, నమ్మకంతో తెలుగుదేశంను ప్రజలు గెలిపించారు. ప్రజల నమ్మకం, ఆకాంక్షలకు అనుగుణంగా నిరంతరం అందుబాటులో ఉండి పనిచేస్తాను. ఇంతటి విజయం ఇచ్చిన ప్రజలకు విధేయుడిగా ఉంటాను. నేను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతులు తీసుకున్నప్పటి నుండి పార్టీ క్యాడర్‌ వెన్నంటి నిలిచింది. నాతో ఉన్న కార్యకర్తలకు అండగా ఉన్నాను. వాళ్లందరి కృషిని గుర్తుపెట్టుకుని పనిచేస్తాను.
ప్ర. చీరాల నియోజకవర్గ అభివృద్దికి మీరేమి చేయబోతున్నారు?
కొండయ్య : రానున్న ఐదేళ్లు ప్రణాళికాబద్దంగా పనిచేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు పెంచే విధంగా చేస్తా. పర్యాటక రంగం అభివృద్దికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారం ఎంతో అవసరం ఉంది. చేనేత రంగం అభివృద్దికి టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణం, పట్టణంలో మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునీకరించడం, దండుబాట రోడ్డు విస్తరణ, కుందేరు అభివృద్ది వంటి పనులు ఒక ప్రణాళిక ప్రకారం చేయిస్తాను.
ప్ర. నియోజకవర్గ అభివృద్దితోపాటు ప్రజల సమస్యలు, అవసరాలు ఏమైనా గుర్తించారా?
కొండయ్య : నియోజకవర్గంలో ప్రజలు చాలా రకాల సమస్యలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బంది ఉందని నా వద్దకు వస్తే అందుబాటులో ఉండి నా వంతు చేతనైన సహాకం తప్పకుండా చేస్తాను. దీనితోపాటు ప్రభుత్వం చేయదగిన పనులు ఉన్నాయి. ప్రధానంగా పేదలకు సొంత ఇళ్లు కట్టుకోవడం ఒక కల. పేదల కల నెరవేర్చేందుకు చంద్రబాబునాయుడు సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిచే పని చేస్తాను. పేదలకు సేవ చేయడమే మహా భాగ్యంగా పెట్టుకుని పనిచేస్తాను. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకానికి విధేయుడనై పనిచేస్తాను. ఐదేళ్లు చీరాలలోనే ప్రజలు అందుబాటులో ఉంటాను. ఇంకా చేయాల్సిన పనులు అనేకం వస్తుంటాయి. ప్రజల అవసరానికి తగ్గట్లుగా ప్రణాళికా బద్దంగా పనిచేస్తాను. అన్ని విషయాలు ఇప్పుడే చెప్పలేను. ప్రభుత్వం ఏర్పడి పాలన గాడిలో పడితే క్రమపద్దతిలో పనులు జరుగుతాయి.

➡️