ప్రజాశక్తి – బాపట్ల
ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో టిడిపి గెలుపును ఆపలేరని టీడీపీ కూటమి ఎంఎల్‌ఎ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. కంటైనర్‌లో రూ.56లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి వివరణ ఇచ్చారు. రాయల్ మెరైన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల జీతాల కోసం తెచ్చిన రూ.56లక్షలు ప్రభుత్వ అధికారులు సీజ్ చెయడం రాజకీయ కుట్రలో భాగమేనని అన్నారు. గుంటూరు స్టేట్ బ్యాంక్ శాఖ నుండి రూ.60లక్షలు తమ కంపెనీ ఫైనాన్స్ మేనేజర్ తీసుకొచ్చి నిజాపట్నంలో రూ.4లక్షలు ఎపెక్స్ అనే కంపెనీకి పేమెంట్ చేసి మిగతా రూ.56లక్షలు అక్కడి నుండి వేరొక కంటైనర్ ద్వారా ఫ్యాక్టరీకి పంపించామని అన్నారు. ఎన్నికల నియమావాళికి సంబంధించి అధికారుల తనిఖీల్లో భాగంగా ఈ డబ్బు సీజ్ చేశారని తెలిపారు. దీనికి సంబందించి అన్ని లెక్కలు పక్కాగా ఉన్నాయని అన్నారు. ఈ అంశాన్ని వైసీపి ఇష్టం వచ్చినట్లు రాజకీయంగా ప్రచారం చేయడాన్ని తప్పు పట్టారు. తాను రాజకీయనేత కంటే ముందు బాధ్యత గల వ్యాపార, పారిశ్రామిక వేత్తనని గుర్తు చేశారు. కుల, మత రహితంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తున్నానన అన్నారు. ఏడాదికి రూ.పది కోట్లు ఆదాయ పన్నుశాఖకు చెల్లిస్తున్నానని అన్నారు. తన ఉద్యోగుల పొట్ట కొట్టి, వాళ్లను రోడ్డు పాలు చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు.
