నూతన శోభను సంతరించుకున్న కార్యాలయాలు

ప్రజాశక్తి – భట్టిప్రోలు
టిడిపి పూర్తి విజయాన్ని సాధించి నేడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలు పచ్చ తోరణాలు, విద్యుత్ కాంతులతో నూతన శోభనం సంతరించుకున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలకు నూతన హంగులు రూపొందించి విద్యుత్ కాంతులతో శోభను అలంకరించినట్లు తహశీల్దారు మునిలక్ష్మి తెలిపారు. ఈ మేరకు తహశీల్దారు కార్యాలయానికి, ఎంపిడిఒ కార్యాలయానికి విద్యుత్ కాంతులు విరాజిల్లటమే కాక నూతనంగా కార్యాలయాల పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షించే విధంగా రూపొందించారు. దీనిలో భాగంగానే మంగళవారం ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.


బాపట్ల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా స్థానిక తహశీల్దారు కార్యాలయాన్ని కనులు మిరు మిట్లు గొలిపే విధంగా విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవంగా మంగళవారం అలంకరించారు. దీంతో తహశీల్దారు కార్యాలయ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.


పర్చూరు : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పర్చూర్లోని వ్యవసాయ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించినట్లు ఎడిఎ ఎ మోహనరావు, ఇతర అధికారులు తెలిపారు.


రేపల్లె : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ దీపాల అలంకరణ చేయాలని ఆదేశాలుండటంతో స్థానిక తహశీల్దారు, ఎంపిడిఒ కార్యాలయానికి రెండు రోజులుగా విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఇప్పటివరకు చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఇటువంటి తరహా ఆదేశాలు ఇవ్వలేదు. తాను మారుతున్నాను, మారిన చంద్రబాబును మీరు చూస్తారని చెప్పిన చంద్రబాబు ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాలు రంగు రంగులుగా దర్శనం ఇచ్చేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు చర్చిస్తున్నారు.

➡️