పైడిమర్రి చిత్రపటానికి నివాళి

ప్రజాశక్తి – బాపట్ల
‘భారతదేశం నా మాతృభూమి. భారతీయులు అందరూ నా సహోదరులు” అనే జాతీయ ప్రతిజ్ఞను రచించిన పైడిమర్రి వెంకట సుబ్బారావు తెలుగు వారుకావడం తెలుగుజాతికి ఎంతో గర్వకారణమని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ కొనియాడారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు 108వ జయంతి సందర్భంగా సాహితీ భారతీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నరసింహ వర్మ మాట్లాడుతూ పైడిమర్రి ఆంగ్ల, తెలుగు, సంస్కృతం, ఉర్దూ తదితర భాషల్లో నిష్ణాతులని తెలిపారు. షేక్ అబ్దుల్ ఖాదర్ జీలాని మాట్లాడుతూ ప్రతిజ్ఞ ద్వారా ప్రతి పౌరునిలో విద్యార్థి దశ నుండే దేశభక్తి, సౌభ్రాతృత్వం, తల్లిదండ్రులు, గురువుల పట్ల ఆదరాభిమానాలు అలవడుతాయని అన్నారు. జంతువుల పట్ల దయా గుణం పెరుగుతుందని అన్నారు. ప్రజాకవి వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాసుల శ్రీనివాస్ మాట్లాడుతూ పైడిమర్రి రచించిన ప్రతిజ్ఞ నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి, విద్యాశాఖ మంత్రి పివిజి రాజు, సాహితీవేత్త తెన్నేటి విశ్వనాథం కృషితో జాతీయ స్థాయి గుర్తింపు పొందిందని అన్నారు. మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ ప్రతిజ్ఞ దేశభాషలన్నిటిలోనూ అనువదింపబడి అనునిత్యం దేశవ్యాప్తంగా పఠిస్తున్న శాశ్వత సజీవ రచనని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదం షఫీ, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, కొమ్మూరి సీతారామాంజనేయులు పాల్గొన్నారు.

➡️