ప్రజాశక్తి-బాపట్ల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో వర్రా రవీందర్ రెడ్డికి బాపట్ల ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి జి రుక్మిణి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలను పరిశీలిస్తే… కూటమి నాయకుల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో రవీందర్ రెడ్డి సోషల్ మీడియా గ్రూపుల్లో అసభ్యకర పోస్టులు, ఫొటోలు పెడుతున్నట్లు జనసేన సానుభూతి పరుడైన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గోగులమూడి గ్రామానికి చెందిన ఆముదాలపల్లి నరేంద్ర ఈ నెల 4న పెదనందిపాడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెదనందిపాడు ఎస్‌ఐ అద్దంకి మధుపవన్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా కడప జైలులో ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని పిటి వారంట్‌పై బాపట్ల కోర్టులో హాజరు పరిచారు. కేసు పూర్వపరాలను విచారించిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గూడూరు రుక్మిణి డిసెంబర్ 13 వరకూ 14 రోజుల పాటు రవీందర్ రెడ్డికి రిమాండ్ విధించారు.