చరిత్రగల శైవ క్షేత్రం పునర్నిర్మాణం

Feb 10,2024 00:01

ప్రజాశక్తి – బాపట్ల
పట్టణంలో శతాబ్దాల చరిత్ర గల శైవ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయాన్ని రూ.కోటి 10లక్షలతో పునర్నిర్మిస్తున్నట్లు బాపట్ల గ్రూపు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి దివి వెంకటేశ్వర్లు తెలిపారు. 325ఏళ్ళ చరిత్ర గల దేవస్థాన సముదాయాన్ని పూర్తిస్థాయిలో తొలగించి అదే స్థానంలో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు. శివాలయం పునర్నిర్మాణానికి వెచ్చిస్తున్న నిధుల్లో రూ.25లక్షల 30వేలు ప్రజలు విరాళాల ద్వారా అందజేశారని అన్నారు. ఆలయ నిర్మాణానికి ఆన్ లైన్ ద్వారా టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు. ఈనెల 12న సీల్డు టెండర్లు పరిశీలించి అర్హులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈనెల 15న అంగరంగ వైభవంగా సోమేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ క్షేత్రం ద్వారా రూ.8లక్షలు ఆదాయం సమకూరుతుందని అన్నారు. శైవ క్షేత్ర నిర్మాణాలను పోలి ఉండే ఈ దేవాలయంలో ధ్వజస్తంభం, ఇతర మూర్తుల గదుల నిర్మాణాలు జరుగుతాయని అన్నారు.

➡️