అక్కడక్కడ మరమ్మత్తులు చేసి…

Mar 31,2024 23:50 ##Roads #Inkollu

ప్రజాశక్తి – ఇంకొల్లు
మండల కేంద్రమైన ఇంకొల్లు నుంచి వివిధ గ్రామాలకు పోయే రోడ్లన్నీ గుంటల మయంగా ఉన్నాయి. ప్రధానంగా ఆర్ అండ్ బి రోడ్లైన ఇంకొల్లు, గంగవరం, పంగులూరు రోడ్డు, ఇంకొట్లు, నాగండ్ల రోడ్డు, ఇంకొల్లు, కడవకుదురు రోడ్డు, ఇంకొల్లు, సంతరావూరు మీదగా చీరాల పోయే రోడ్డు, ఇంకొల్లు నుంచి తిమ్మసముద్రం మీదుగా చీరాల పోయే రోడ్డు, ఇంకొల్లు, నాగండ్ల, ద్రోణాల రోడ్డు, అడ్డరోడ్డు నుంచి ఇడుపులపాడు మీదుగా సుదివారిపాలెం, నాగండ్ల, ద్రోణాదుల రోడ్డు, పావులూరు నుంచి నాగండ్ల మీదగా కోళ్లపూడి, మార్టూరు జాతీయ రహదారికి పోయే రోడ్డు, ఇంకొల్లు, దగ్గుబాడు, పోతినవారిపాలెం, స్వర్ణ రోడ్డు, ఇంకొల్లు, హనుమోజిపాలెం, జరుబులవారిపాలెం, కేశవరప్పాడు రోడ్డుతోపాటు పాత మద్రాస్ రోడ్డుగా ప్రసిద్ధి పొందిన ఇంకొల్లు నుంచి దగ్గుబాడు, వంకాయలపాడు, నూతలపాడు, పర్చూరు రోడ్డు పూర్తిగా దెబ్బతిని వాహన ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి. టీవీ వల్ల అక్కడక్కడ కొన్ని రోడ్లు మరమ్మత్తులు చేపట్టినప్పటికీ అవి తాత్కాలికంగానే ఉన్నాయి. నిదానంగా ఇంకొల్లు, దగ్గుబాడు, నతలపాడు రోడ్డు, ఇంకొల్లు, నాగళ్ల రోడ్లు గత నాలుగేళ్ల నుంచి వాహన ప్రయాణికులతో పాటు ఆయా గ్రామాల్లో వ్యవసాయ పనులు చేసుకునే ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనదారులకు సైతం ఇబ్బందిగానే ఉన్నాయి.
పరిమితికి మించిన లోడుతో ట్రావెల్ టిప్పర్లు
ఇంకొల్లు, నాగండ్ల, కోళ్లపూడి రోడ్డు ప్రధానంగా కాల్లపూడి, ద్రోణాల, బొబ్బేపల్లి గ్రామాల్లోని గ్రావెల్ కొండల నుంచి ఎర్ర మట్టి గ్రావెల్‌తో పాటు గ్రానైట్ కంపెనీల వద్ద ఉన్న వ్యర్ధాలైన డస్టుతో పాటు వివిధ రకాల ముక్కలను గుత్తేదారులకు సంబంధించిన టిప్పర్లలో పరిమితికి మించిన లోడుతో ఈ రోడ్లలో ట్రిప్పర్లు తిరగడంతో రోడ్డు మొత్తం గుంతల మయమైంది. రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి.
ట్రిప్పర్ల యజమానులకు రాజకీయ అండ తోడవటంతో అధికారులు నోరెత్తడంలేదు. గ్రావెల్ కస్టర్ల వద్ద నుంచి గ్రావెల్ రవాణా చేసే యజమానులతోపాటు గ్రావెల్ కొండలు కాంట్రాక్టుకు తీసుకున్న కాంట్రాక్టర్లకు ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల అండ, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉండుటంతో అదనపు లోడుతో రోడ్లపై ప్రయాణిస్తున్న టిప్లర్లను సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఆయా అధికారులకు సంబందిత వర్గాల నుంచి నెల మామూళ్లు పుచ్చుకోవటం తప్పనిసరి అయ్యింది. కడవకుదురు, చిన్నగంజాం, పందిళ్ళపల్లి ప్రాంతాల నుంచి ఇసుక ట్రాక్టర్లు నిత్యం ఇంకొల్లు మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పంగులూరు మండలంలోని బోదవాడ, ఆరికట్లవారిపాలెం, మల్లవరం, కళ్ళంవారిపాలెం గ్రామాలకు ట్రాక్టర్లు, టిపర్ల ద్వారా రవాణా జరుగుతూనే ఉంది. అదే విధంగా కోళ్లపూడి, తాటివారిపాలెం, బొల్లాపల్లి, ద్రోణాదల గ్రామాల్లోని కొండల నించి చిన్నగంజాం, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, జె పంగులూరు, నాగులుప్పలపాడు మండలాల్లోని గ్రామాల్లో వివిధ నిర్మాణాలు, కట్టడాలకు, అంతర్గత రోడ్లకు గ్రావెల్ క్రషర్లు, గ్రానైట్ కంపెనీల వ్యర్ధాలు తరలిస్తుంటారు. అధిక లోడుతో ట్రిపర్లు గ్రామాల్లో తిరుగుతుండటంతో రోడ్లు కుదేలవుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

➡️