సిమెంట్ లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు – డ్రైవర్ కు గాయాలు 

Mar 12,2025 10:40 #Bapatla District

ప్రజాశక్తి – పంగులూరు : వేగంగా ప్రయాణిస్తూ నిద్రమత్తులోకి జారుకుని ఎదురుగా వెళుతున్న సిమెంటు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం తెల్లవారుజామున మండలంలోని రేణింగవరం గ్రామ సమీపాన జాతీయ రహదారిపై జరిగింది. రేణింగవరం ఎస్సై వినోద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం నుండి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం తెల్లవారుజామున రేణింగవరం సమీపంలోకి వచ్చింది. అదే సమయంలో డ్రైవర్ కే.శేఖర్ నిద్రమత్తులోకి జారుకుని ఎదురుగా వెళుతున్న సిమెంటు లారీని ఢీకొట్టాడు. వెంటనే చేరుకొని ఎడమవైపుకు బస్సును మరల్చడంతో బస్సు పొలాల్లోకి వెళ్ళింది. బస్సు ముందువైపు భాగం బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శేఖర్ కాళ్లకు బాగా గాయాలయ్యాయి. బస్సులోనే ఇరక్క పోయాడు. తరువాత హైవే సిబ్బంది వచ్చి తీశారు. డ్రైవర్ శేఖర్ ది చిత్తూరు జిల్లా నెమలికుంట గ్రామం. ప్రమాద సమయంలో ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, వారికి ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎస్ఐ వినోద్ బాబు తెలిపారు. చికిత్స నిమిత్తం డ్రైవర్ శేఖర్ ను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినోద్ బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు.

➡️