ప్రజాశక్తి – చీరాల
ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు భవన సముదాయం నందు న్యాయ విజ్ఞాన సదస్సు శుక్రవారం నిర్వహించారు. సదస్సులో సీనియర్ సివిల్ జడ్జ్, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం సుధా మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు కుటుంబ సభ్యులను అనాధలుగా మార్చకుండా ఉండవచ్చని అన్నారు. భారీ జరిమానాల నుండి తప్పించుకోవచ్చని సూచించారు. బైక్ రేసులు, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు డ్రైవింగ్ చేయటం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం వంటి నేరాల నుంచి ప్రజలు, యువతను దూరంగా ఉండాలని చెప్పారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌కె రెహనా మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం ద్వారా ఎవరి ప్రాణాల్ని వాళ్ళు కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి రమేష్ బాబు, సోషల్ వర్కర్ పిఎల్‌విఎస్‌డి మతీన్, న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
