సముద్రాలు రక్షించి జీవవైవిద్యాన్ని కాపాడండి

ప్రజాశక్తి – బాపట్ల
భూ వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంలో సముద్రాలు మానవాళికి మహోపకారం చేస్తాయని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి పిసి సాయిబాబు అన్నారు. శనివారం ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఫోరం ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్ఎంజి బాలికల ఉన్నత పాఠశాల్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వాతావరణంలో ఏర్పడుతున్న కాలుష్యాన్ని నివారించి ప్రజలకు మేలు చేసే అద్భుతమైన పాత్ర సముద్రాలు పోషిస్తాయని అన్నారు. బొగ్గు పులుసు వాయువును శోషించుకుని ప్రాణవాయువును జీవజాతులకు అందిస్తాయని అన్నారు. భూతాపాన్ని నియంత్రించి జీవ వైవిధ్యానికి పట్టుగొమ్మలుగా నిలుస్తాయని అన్నారు. ఎన్నో రకాల జీవుజాతులకు ఆవాసాలు కాగా భూగోళానికి సముద్రాలు ఊపిరితిత్తుల వంటివని అన్నారు. రూ.కోట్ల విలువైన వనరులను జాతికి అందజేస్తాయని అన్నారు. మానవాళికి ఎంతగానో ఉపయోగపడే సముద్రాలను అనేక వ్యర్థాలతో కలుషితం చేస్తున్నామని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలతో సముద్రాలు కలుషితం కావడంతో ఎన్నో జీవరాసులు అంతరిస్తున్నాయని అన్నారు. దీనివల్ల జీవ వైవిద్యం దెబ్బతింటుందని తెలిపారు. సముద్రాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సముద్రాలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం టి రమాదేవి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️