బాపట్ల జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాలి : ఎస్ఎఫ్ఐ

Jul 11,2024 23:48 ##Bapatla #SFI #CPM

ప్రజాశక్తి – బాపట్ల
మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు గత ప్రభుత్వం ఇచ్చిన జీఒను అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్నకుమార్ కోరారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సమావేశంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల నుండి బాపట్ల జిల్లా కొత్తగా ఏర్పడిన ఈ ప్రాంతం వ్యవసాయ కార్మికులు, దళితులు, వెనుకబడిన తరగతుల కౌలు రైతులు ఎక్కువగా నివాసం ఉండే జిల్లాలో పేద విద్యార్థులు చదువుకునేందుకు అవసరమైన ప్రభుత్వ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యారంగం అభివృద్ధి చెందుతున్న బాపట్ల జిల్లాలో ప్రధాన పట్టణాలైన బాపట్ల ,చీరాలలో డిగ్రీ చదువుకు కో ఎడ్యుకేషన్ ప్రభుత్వ కళాశాలలు లేకపోవడంతో ఈ ప్రాంతాల విద్యార్థులు అధిక వ్యయ ప్రయాసల కోర్చి ప్రైవేటు కళాశాలలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని అన్నారు. పీజీ కోర్సులు చదివేందుకు దూర ప్రాంతాలైన గుంటూరు, ఒంగోలు వెళుతున్నారని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ పిజి సెంటర్ ఏర్పాటుకు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రులు, జిల్లా శాసన సభ్యులు కృషి చేయాలని కోరారు. గత ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో అభివృద్ధి చేసి, విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మోటిక్స్ చార్జీలు, నోట్ పుస్తకాలు, ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ఇవ్వకుండా వాటికి నిధులు కేటాయించ కుండా గత ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం ఉందంటూ మాటలు చెప్పి సంక్షేమ హాస్టల్ విద్యార్థులను మోసం చేసిందని అన్నారు. గతేడాది విద్యార్థులకు ఇవ్వాల్సిన పది నెలల కాస్మోటిక్ చార్జీలు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి నిధులు కేటాయించి, ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేసి, హాస్టల్ విద్యార్థులకు చెల్లించాల్సిన కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు శివశంకర్, ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు హేమ, నాగశ్రీ, ప్రేమ్ చందు, నితిన్, సందీప్, నవీన్, అహ్మద్ పాల్గొన్నారు.

➡️