ఓట్ల లెక్కింపుకు పటిష్ట బద్రత చర్యలు : ఎస్పీ వాకుల్ జిందాల్

May 20,2024 23:09 ##Bapatla #Chirala #Police

– లాడ్జిలు, హోటల్లో ఆకస్మిక తనిఖీలు
– అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఇవ్వాలని ఆదేశం
– కొత్త వ్యక్తులపై పోలీసుల ప్రత్యేక నిఘా
ప్రజాశక్తి – చీరాల
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు పటిష్ట బద్రత చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా మే 19న ఆదివారం రాత్రి లాడ్జీలు, హోటళ్లు, రిసార్ట్స్‌లో పోలీసు అదికారులు తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వాటిలో పనిచేసే సిబ్బందికి సూచనలు చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే నియోజకవర్గంలోని లాడ్జిలు, రిసార్ట్స్, హోటళ్లను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, తరచూ ఘర్షణలు పడే వ్యక్తులు, పాత నేరస్తులు ఉన్నారేమోనని పరిశీలించినట్లు తెలిపారు. లాడ్జీలు, రిసార్ట్స్, కళ్యాణ మండపాల నిర్వాహకులు, యజమానులు అనుమానితులకు ఆశ్రయం కల్పించకూడదని సూచించారు. ఎవరైనా పాత నేరస్తులు, అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం వున్న వారు, అనుమానితులు ఉంటే వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అనుమానాస్పదంగా గాని, గుంపులుగా గాని సంచరిస్తుంటే వెంటనే 100, 112కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీల్లో సిఐలు శేషగిరిరావు, సోమశేఖర్, నిమ్మగడ్డ సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️