టిడిపి విజయోత్సవ ర్యాలీ

ప్రజాశక్తి – రేపల్లె
మండలంలోని నల్లూరిపాలెం గ్రామంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్ మూడోసారి హెడ్రిక్ సాధించడంతో గ్రామంలో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేసుకొన్నారు. డప్పు వాయిద్యాలు, డీజే డ్యాన్సులు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని పరిటాల రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. టిడిపి నాయకులు, నల్లూరిపాలెం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వీరవల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ ఐదేళ్ల వైసిపి పాలనలో అరాచకాలు, అణచివేతలు తప్ప అభివృద్ధి లేదన్నారు. ఎన్‌డిఎ విజయం నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రకటించారు. “రాబోయే ఐదేళ్లలో వాగ్దానం చేసినట్లుగా కొత్త ప్రభుత్వం 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తే మళ్లీ చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరన్న విశ్వాసంతో పూర్తి మెజారిటీ కట్టబెట్టారని అన్నారు. రాష్ట్రంలో టిడిపి కూటమి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి, అరాచక, దౌర్జన్యాల వైసిపిని చిత్తు చిత్తుగా ఓడించడం ప్రజావిజయమని అభివర్ణించారు. ఎట్టకేలకు రాష్ట్రం మళ్ళీ భావితరాల అభ్యున్నతికి బాటలు వేస్తూ, ప్రజాహితమైన సంక్షేమాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకు పోయే నైపుణ్యం, పరిపాలనా దక్షిత ఉన్న నాయకుడు చంద్రబాబు చేతుల్లోకి రావటం శుభసూచకం అన్నారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధి ప్రధాన అజెండాగా టిడిపి, జనసేన, బిజెపి కూటమి ముందుకు సాగనున్నట్లు తెలిపారు. అనంతరం నందమూరి నటసింహం, హిందూపురం ఎంఎల్‌ఎ బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత కార్యకర్తలు టపాసులు కాలుస్తూ జై బాలయ్య నినాదాలతో సందడి చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. బాలకృష్ణ సినీ, రాజకీయ రంగాల్లోనే కాకుండా సామాజిక సేవలు చేస్తూ విశేష ఆదరణ పొందుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మేదరమెట్ల : ఇటీవల జరిగిన ఎన్నికల్లో వివిధ గ్రామాల్లో టిడిపికి వచ్చిన మెజారిటీల్లో పమిడిపాడు గ్రామంలో అత్యధికంగా 1200 ఓట్ల మెజార్టీ లభించిన సందర్భంగా గ్రామంలో టిడిపి మండల అధ్యక్షుడు జాగర్లమూడి జయకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అత్యధికంగా మహిళలు పాల్గొన్నారు.

➡️