భర్త బాధ భరించలేక ఆత్మహత్య

ప్రజాశక్తి – బాపట్ల
కారంచేడు మండలం కుంకలమర్రుకు చెందిన బత్తుల వెంకట్రావుకు శోభారాణితో గత కొన్నేళ్ళ క్రితం వివాహం చేశారు. అక్కడ అప్పుల పాలైన భార్యా, భర్తలు బాపట్ల మండలం వెదుళ్ళపల్లికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ కూడా అప్పులు బాధ తప్పలేదు. ఆటో డ్రైవర్‌గా ఉన్న వెంకటరావు అనేక చోట్ల అప్పులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అతని బాధ భరించలేక, అప్పులోళ్ళకు సమాధానం చెప్పలేక బాకీలు తీర్చే క్రమంలో భార్య శోభారాణి భర్త నడిపే ఆటోను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. ఆటో యజమాని వచ్చి ఆటోతో వెంకటరావుకు సంబంధం లేదని చెప్పి ఆటో తీసుకెళ్లారు. ఈ విషయమై తనకు న్యాయం చేయటంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించింది. ఆటోను తిరిగి ఇచ్చినందుకు పోలీసులను శోభారాణి ప్రశ్నించింది. పోలీసు అధికారుల ఆదేశాలతోనే యజమానికి ఆటోను అప్పగించామని పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో ఆందోళనకు గురైన ఆమె పోలీస్ స్టేషన్ ఎదుట పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో వెళ్లిన ఆమెను స్థానికులు బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి గురువారం ఆమె మృతి చెందారు. భర్త పెట్టిన ఇబ్బందుల వల్లే శోభారాణి చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు వెదుళ్ళపల్లి సెంటర్లో రాస్తారోకో చేశారు. కారకుడైన భర్త వెంకట్రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ హజరత్ బాబు తెలిపారు.

➡️