ప్రయాణ సంకటంగా పెదలంక ప్రధాన రహదారి

Jun 10,2024 00:07 ##Battiprolu #Kolluru #Roads

ప్రజాశక్తి – భట్టిప్రోలు
రెండు, మూడు గ్రామాలకు ప్రధాన రహదారిగా ఉన్న పెదలంక మధ్య గూడెం రహదారి నిరంతరం నీటితో నిండిపోయి బురద మయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. మండలంలోని పెదలంక మధ్య గూడెంలో మండల పరిషత్తు పాఠశాల గేటుకు ఎదురుగా రహదారి పూర్తిగా పల్లం కావడంతో వర్షం పడకపోయినా గ్రామంలో వాడుక నీరు రహదారిపైకి వచ్చి నిరంతరం బురదమయంగా మారుతుంది. దీంతో పాఠశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది. పాఠశాల్లోపలకు వెళ్లడానికి పల్లపు ప్రాంతంగా ఉన్న ఈ బురదలో నుండే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 20ఏళ్ల క్రితం నిర్మించిన ఈ సిసి రహదారికి ఇరువైపులా గ్రామస్తులు మెరకలు తోలు కోవటంతో రహదారి పల్లంగా మారింది. ఈ రహదారి గుండా కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామస్తులు, చల్లపల్లి మండలం ఆముదాలంక గ్రామస్తులు పెదలంక నుండి రేపల్లెకు వెళ్లేందుకు ప్రధాన రహదారి. ఈ గ్రామాల నుండి పెసర్లంక జెడ్‌పి ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఇదే రహదారి ప్రధాన రహదారి. ఉన్నత పాఠశాల విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఈ బురదలోనే సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీని కారణంగా బురద చింది బ్యాగులు, పుస్తకాలు, బట్టలపై పడుతూ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈపాటికే లంక గ్రామాల్లోని రహదారులు పూర్తిగా దెబ్బతిని గుంటలు ఏర్పడి ప్రజలు ఇబ్బంది కరంగా మారగా మజ్జిగూడ సమీపంలో వర్షం పడకపోయినా నిరంతరం నీరు నిలబడే బురదగా మారటం పట్ల ఇప్పటివరకు సంబంధిత పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని గ్రామస్థులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ బురద ప్రాంతమే మూడు మండలాలకు కూడలి
పెదలంక, మధ్యగూడెం పాఠశాల సమీపంలో పల్లపు ప్రాంతంగా మారిన ఈ రహదారి మూడు మండలాల ప్రాంతానికి సంబంధించినది కావటం విశేషం. ఈ బురద రహదారి సమీపంలో భట్టిప్రోలు, కొల్లూరు, చల్లపల్లి మండలాలకు ప్రధాన రోడ్డు కావటంతో ఎవరికి వారు తమకు ఎందుకులే అనే భావనతో పట్టించుకోవటం లేదని అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈపాటికే గత నాలుగేళ్లుగా ఈ రహదారిపై నీరు నిలబడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నూతన ప్రభుత్వ పాలనలో అధికారులు స్పందించి ప్రజల ఇబ్బందులను గుర్తించి ఈ రహదారి అభివృద్ధికి చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

➡️