ఆర్టీసీ బస్టాండు పరిశీలించిన మేనేజర్ : మరుగుదొడ్ల మరమ్మత్తులు వెంటనే చేపడుతాం

Jul 16,2024 01:09 ##Inkollu #RTC

ప్రజాశక్తి – ఇంకొల్లు
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణతోపాటు బస్టాండులో ఉన్న మరుగుదొడ్లను చీరాల ఆర్టీసీ డిపో మేనేజర్ శ్యామల సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అసౌకర్యంగా ఉన్న మరుగుదొడ్ల మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని ఆర్టీసీ సివిల్ ఇంజనీరింగ్‌ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు, సెక్షన్ ఆఫీసర్‌ డి సుబ్బారావుకు సూచించారు. మరుగుదొడ్లు కొంతకాలంగా అసౌకర్యంగా ఉండటంతో ప్రయాణికులు చీరాల డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆమె సోమవారం బస్టాండు ఆవరణను పరిశీలించారు. బస్టాండ్ ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని అధికారులకు సూచించారు. మరుగుదొడ్లకు అవసరమైన కొలతలు, గతంలో టిడిపి కాలంలో నిర్మించిన గదుల ముందు ఆవరణలో సిమెంటు ప్లాట్ఫారం ఏర్పాటుకు అవసరమైన కొలతలను ఆమె వెంట వచ్చిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు తీశారు. 45గ్రామాలకుపైగా కుడలిగా ఉన్న ఇంకొల్లు బస్టాండుకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. 30ఏళ్ల క్రితం నిర్మించిన మరుగుదొడ్లు తరచూ మరమ్మత్తులకు వస్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఇంకొల్లు నుంచి చిలకలూరిపేటకు గతంలో రెండు బస్సులు తిరిగేవని ప్రస్తుతం ఒక బస్సు మాత్రమే తిరుగుతుందని ఆమె దృష్టికి తెచ్చారు. గతంలో చీరాల నుంచి ద్రోణాల మీదగా మార్టూరుకు బస్సు నడిపే వారని, ఆ బస్సు ప్రస్తుతం రద్దు చేశారని ప్రయాణికులు తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం బాపట్లకు ఇంకొల్లు నుంచి మరో బస్సు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో నడిపి ప్రస్తుతం నిలిపిన సర్వీసులు పునరుద్దరించాలని కోరారు. కార్యక్రమంలో ఆమె వెంట ఇన్చార్జి సివిల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, డి సుబ్బారావు, కంట్రోలర్ షేక్ బాబు, ప్రయాణికుల సంఘం అధ్యక్షులు మోహనకృష్ణ పాల్గొన్నారు.

➡️