కరెంటు కష్టాలు వర్ణణాతీతం

Jun 8,2024 23:45 ##Addanki #apcpdcl

– వేసవిలో ఓల్టేజీ, వర్షం పడితే కరెంటు బంద్‌
– పట్టించుకోని విద్యుత్తు అధికారులు
– తీగల నిర్వహణ వదిలేసిన అధికారులు
– విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు
– రూ.10వేలు ఇస్తే అనధికారికంగా ఎంత పనైనా చేస్తారు
– ఎంతటి వారైనా మీటర్‌ కోసం లైన్‌మెన్‌ను కలవాల్సిందే
– మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే కుంటి సాకులతో జాప్యం
ప్రజాశక్తి – అద్దంకి
పట్టణం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. అదే స్థాయిలో అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. కానీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తమ జేబులను నింపుకొనే పనిలో ఉన్నారే తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదు. పట్టణ, గ్రామీణ ప్రజల విద్యుత్‌ కష్టాలే నిదర్శనం. గత కొన్నేళ్లుగా విద్యుత్తు సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
ఇంప్రూమెంట్ ట్రాన్స్‌ఫారాలు ఎక్కడ
లో ఓట్టేజ్ సమస్య ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలంటే సంబంధిత ప్రాంతాల్లో ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్‌ఫారాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అవి ఏర్పాటు చేస్తే లో ఓల్టేజి సమస్య ఉండదు కదా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పట్టణంలో ఎక్కడ కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయలేదు. చినుకు పడినా, గాలివీచినా విద్యుత్ ఉండదు. వేసవి వస్తే విద్యుత్తు లో ఓల్టేజ్ సమస్య వినియోగ దారులను కలవరపెడుతుంది. ప్రజలు ఇంత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో అనేకసార్లు లో ఓల్టేజీ సమస్యతో గృహోపకరణాలు దగ్ధమైన సందర్భాలు ఉన్నాయి. సమస్య పరిష్కరించాలని అధికారులకు చెబితే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. పట్టణానికి దక్షిణం వైపు ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ నుండి ఒకే ఫీడర్ ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతానికి విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. విద్యుత్ సమస్య వచ్చినప్పుడు అధికారులు విద్యుత్తును నిలుపుదల చేసి సమస్యను పరిష్కరిస్తున్నారు. తరచూ ఇలా జరుగుతూ ఉండడంతో అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో మీనాక్షి రెస్టారెంట్ ప్రాంతం నుండి లో ఓల్టేజి సమస్య అత్యంత ఎక్కువగా ఉందని, దీనితోపాటు భాగ్యనగర్‌, దామవారి పాలెం, కాకానిపాలెం ప్రాంతాల్లో లో ఓల్టేజితో ఇబ్బందులు పడుతున్నారు.
గాలికి వదిలేసిన తీగల నిర్వహణ
విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాకుండా విద్యుత్తు తీగల నిర్వహణ చేస్తుంటారు. అద్దంకిలో మాత్రం విద్యుత్ అధికారులు మాత్రం విద్యుత్తు లైను క్రింద ఉన్న చెట్టు కొమ్మలను కూడా తొలగించే పరిస్థితి లేదు. గాలి వీచినా, వర్షం జల్లులు కురిసినా చెట్టు కొమ్మల వలన విద్యుత్తు ట్రిప్‌ అవుతుంది. విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఎప్పుడు విద్యుత్తు వస్తుందో, ఎప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తారో తెలియదు. పెరుగుతున్న ప్రజల అవసరాల రీత్యా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యుత్తు వినియోగం పెరిగింది. అదే సమయంలో అవసరానికి తగిన సరఫరా సామర్ధ్యం మాత్రం పెంచలేదు.
విద్యుత్తు అధికారులు నిర్లక్ష్యం
విద్యుత్‌పై జీవన పరిస్థితులు ఆధారపడిన నేపధ్యంలో కాలం చెల్లిన విద్యుత్ స్తంభాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కోకోల్లలు కనిపిస్తున్నాయి. అవి ఏ రోజు క్రింద పడతాయో తెలియని పరిస్థితి ఉంది. బొమ్మనంపాడు గ్రామ సమీపంలోని సుబాబులు పొలాల్లో విద్యుత్ స్తంభాలు సగం విరిగిపడి ఉన్నాయి. ఆ ప్రాంతంలో పశువులు మేపుకునే రైతులు ఆ విద్యుత్తు వైర్లను చూసి భయపడుతూ ప్రమాద కర స్థితిలో పశువులను మేపుకుంటున్నారు. ఈ విషయం గురించి అనేకసార్లు ఆ ప్రాంత ప్రజలు అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ పట్టించుకోలేదు.
లైన్‌మెన్ల చేతివాటంతో ప్రజలకు ఇబ్బందులు
ఇంటి అవసరాలకు విద్యుత్తు మీటరు రావాలంటే సంబంధిత లైన్‌మెన్‌ను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వినియోగదారుడు స్వతగా దరఖాస్తు చేసుకుంటే ఆ ఇంటికి మీటరు రాదు. అనేక అనవసర కారణాలు చూపి ఇబ్బంది పెడతారు. మన అర్జీ విద్యుత్ అధికారులకు వెళ్లినప్పటికీ కుంటి సాకులతో మీటర్ వెనుకకు పంపిన సందర్భాలు ఉన్నాయి. ఆ లైన్ మెన్ జేబు నింపితేనే మరలా విద్యుత్తు మీటరు వస్తుంది. దీంతో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక లైన్‌మెన్ సంబంధిత అధికారిని తన అదుపులో ఉంచుకుని అనధికారికంగా కొత్త స్తంభాలు ఏర్పాటు, లైన్లు ఏర్పాటు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు విద్యుత్ అధికారులు గత కొన్నేళ్లుగా ఇక్కడే పాతుకుపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు. నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిన విద్యుత్ అధికారులను మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విద్యుత్‌ వినియోగదారుల సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.

➡️