ఎన్నికల విధులకు హాజరు కాని ఉపాధ్యాయుల సస్పెన్షన్ ఎత్తివేయాలి

Jun 8,2024 23:34 ##Bapatla #Teacher

ప్రజాశక్తి – బాపట్ల
అనారోగ్య రీత్యా ఎన్నికల విధులకు హాజరుకాని ఉపాధ్యాయుల సస్పెన్షన్లను మానవతా దృక్పథంతో ఎత్తివేయాలని ఆలిండియా రాష్ట్రో పాధ్యాయ సంఘం జాతీయ ఆర్థిక కార్యదర్శి జోసెఫ్ సుధీర్ బాబు అన్నారు. స్థానిక జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన రాష్ట్రోపాధ్యాయ సంఘం బాపట్ల జిల్లా శాఖ తొలి కార్యవర్గ సమావేశానికి జోసఫ్ సుధీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాసిరకమైన జెవికె కిట్లను విద్యార్థులకు సరఫరా చేసి అనేక అవక తవకలకు పాల్పడడంతోపాటు అక్రమ బదిలీలు చేయించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌పై విచారణ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ గత ప్రభుత్వ కాలంలో అన్యాయంగా చేసిన ఉపాధ్యాయుల సస్పెన్షన్‌లు, మెమోలు, పెండింగ్ చార్జీమేమోలను వెంటనే రద్దు చేయాలని అన్నారు. నూతన విద్యా విధానాన్ని తిరిగి పరిశీలించాలని కోరారు. జిఒ 117 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షులు బడుగు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఐఆర్ ప్రకటించి, విశ్రాంత ఉపాధ్యాయులకు వెంటనే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుడివాడ అమరనాథ్, జిల్లా గౌరవ అధ్యక్షులు చందు వెంకటేశ్వరరావు, ఆర్థిక కార్యదర్శి బొంతా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్లు గుగ్గిలం ఉదయ శంకర్, చందా నరసింహారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నూరుబాషా సుభాని, బత్తుల నాగరాజు, ముజఫర్ జానీ, ఆసిఫ్ అలీ, శివాంజనేయులు, జి రమేష్ బాబు, కరీముల్లా, ప్రసాద్, ఏసురత్నం, ఓ శ్రీనివాసరావు, ఏవీ నారాయణ, నర్రా సుబ్బారావు, అర్షదుల్లా బేగ్, పివిఎస్ ప్రసాద్, రాజేంద్ర, వేణుగోపాల్ పాల్గొన్నారు.

➡️