ప్రజాశక్తి – చీరాల
వైసీపీ ప్రభుత్వంలో దళితులు గర్వపడేలా విజయవాడలో నూతనంగా బారిస్థాయిలో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిలాఫలకాన్ని పగలగొట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. శిలాఫలకాన్ని పగలగొట్టడాన్ని ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల దుస్తులతో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నడిబొడ్డున ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సామాజిక మహా శిల్పాన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాత్రి వేళలో శిలా ఫలకాన్ని సుత్తులతో ధ్వంసం చేయడం దుర్మార్గమని అన్నారు. అంబేద్కర్ అందించిన ఫలాలతో హోం మంత్రిగా ఉన్న అనిత తక్షణమే జరిగిన ఘటనపై స్పందించాలని అన్నారు. ఇది రాజ్యాంగ నిర్మాతకు జరిగిన అవమానంగా భావిస్తూన్నామని అన్నారు. తక్షణమే పోలీసులు చర్యలు తీసుకొవాలని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, శిఖాకొల్లి వెంకటేశ్వర్లు, అర్బన్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు యాదవ్, యాతం మేరిబాబు, గోశాల అశోక్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు బత్తుల అనిల్, చీమకుర్తి బాలకృష్ణ, వాసిమల్ల వాసు, గోశాల అశోక్, హచ్ రమేష్ యాదవ్, శిఖా సురేష్, గోలి గిరి కుమార్, సల్లూరి అనిల్ పాల్గొన్నారు.
