తమిళనాడు బిఎస్‌పి అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌కు నివాళి

Jul 14,2024 22:38 ##Addanki #BSP

ప్రజాశక్తి – అద్దంకి
తమిళనాడు బిఎస్‌పి అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది ఆర్మ్‌స్ట్రాంగ్‌ను దుండగులు ఆయన ఇంటిలోకి ప్రవేశించి ఈనెల 5న కత్తులతో దారుణంగా హత్య చేశారని బిఎస్‌పి నాయకులు పేర్కొన్నారు. స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో బీఎస్పీ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు ఆర్మ్‌స్ట్రాంగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఆదివారం నివాళి అర్పించారు. దొంగలు, రౌడీషీటర్లు, కబ్జాకోరులను కోర్టుకు లాగి పేదలకు అండగా నిలబడిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ను కిరాయి హంతకులచే హత్య గావించడం దారుణమైన విషయమని అన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు మంద జోసెఫ్, ఎస్‌సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నక్క కాంతారావు, ఎపి ఎస్‌సి, ఎస్టి, బిసి, మైనారిటీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, జై భీంరావు పార్టీ అధ్యక్షులు పులిపాటి హేబెలు, పూనూరి నరేంద్ర, మంచు హనుమంతరావు, రోషన్ బాబు, రోశయ్య పాల్గొన్నారు.

➡️