బేస్తవారిపేటను అభివృద్ధి చేస్తా

ప్రజాశక్తి-బేస్తవారిపేట: బేస్తవారిపేట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తానని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ వేగినాటి ఓసురారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గిద్దలూరు శాసనసభ్యులు అశోక్‌రెడ్డి మాట్లాడుతూ మండల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. అనంతరం గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ పథకం, విద్యుత్తు శాఖలపై సమీక్ష నిర్వహించారు. నీటి సరఫరా సమీక్షలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా అవసరమైన ప్రతిపాదనను సిద్ధం చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు రైతులకు ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. విద్యుత్‌ శాఖ సమీక్షలో మాట్లాడుతూ గ్రామాల్లో నిరంతర విద్యుత్‌ సరఫరా చేపట్టాలని, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ పంపిణీ చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పిటిసి బి వెంకటరాజు, ఎంపీడీవో టీ పార్వతి, అన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

➡️