ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరులో కమర్షియల్ (వాణిజ్య) సంస్థలు, చికెన్ స్టాల్స్ నుండి అనధికార వ్యర్థాల సేకరణ తక్షణం నిలిపివేయాలని, నగర కమిషనర్ పి.శ్రీనివాసులు అన్నారు. జిఎంసి ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి కమర్షియల్ సంస్థ డిఅండ్‌ఒ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్లు, డ్రెయిన్ ఆక్రమణలను స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాణిజ్య సంస్థల నుండి వ్యర్ధాల సేకరణకు గతంలో 2 సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వగా ఆయా సంస్థల కాంట్రాక్ట్ గడువు ముగిసిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున కోడ్ అనంతరం నూతన టెండర్ పిలుస్తామని తెలిపారు. కానీ కొంత మంది జిఎంసి నుండి అనుమతులు లేకుండా అనధికారికంగా ఆయా సంస్థల నుండి వ్యర్ధాలు సేకరణ చేసి, అధిక మొత్తంలో నగదు వసూళ్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. వారు వసూళ్లు నిలిపేయకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చికెన్ స్టాల్స్ నుండి వ్యర్థాల సేకరణను టెండర్ ద్వారా కాంట్రాక్టర్‌కి కేటాయించామని, క్షేత్ర స్థాయిలో ఆయా స్టాల్స్ నిర్వాహకులు సదరు కాంట్రాక్టర్‌కు వ్యర్థాలను ఇవ్వకుండా అనధికారిక వ్యక్తులకు ఇస్తున్నారన్నారు. ఆ విధంగా సేకరించిన వ్యర్ధాలను చేపల చెరువులకు తరలిస్తునారని, వారిపై స్వచ్ఛ సర్వేక్షణ్, ప్రజారోగ్య రక్షణ రీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డిఅండ్‌ఓ ట్రేడ్ లైసెన్స్‌లు ఉండాల్సిన సంఖ్య కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించామని, వచ్చే శనివారం నాటికి నూరు శాతం ట్రేడ్ లైసెన్స్‌లు విధించడం, పాత వాటిని రెన్యువల్, ఫీజుల వసూళ్లు చేయాలని ప్రజారోగ్య విభాగ అధికారులను, కార్యదర్శులను ఆదేశించామన్నారు. శనివారం తర్వాత ట్రేడ్ లైసెన్స్ లేని కమర్షియల్ సంస్థలను సీజ్ చేస్తామన్నారు. శంకర్ విలాస్, ఇన్నర్ రింగ్ రోడ్ గడ్డిపాడు రైల్వేగేటు వద్ద ఆర్‌ఒబిల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం అవుతాయని, సంజీవయ్య నగర్, శ్యామలా నగర్ దగ్గర కూడా ఆర్‌ఒబి మంజూరయ్యే అవకాశం ఉన్నందున నగరంలో ప్రజల రాకపోకలకు వీలుగా రోడ్ల విస్తరణ, ఆక్రమణల తొలగింపు అత్యావశ్యకమన్నారు. డ్రెయిన్లు, రోడ్లు ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేకుంటే జిఎంసి సిబ్బందే తొలగిస్తారని స్పష్టం చేశారు. నగర ప్రజల సౌకర్యార్ధం, మౌలిక వసతుల కల్పనకు కోసం జిఎంసి చేపట్టే చర్యలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
