వేసవి కాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ : వేసవి కాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కార్యక్రమాన్ని 100 శాతం అమలు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండ్యన్‌ వైద్యాధి కారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, ప్రోగ్రాం అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వీరపాండ్యన్‌ మాట్లాడుతూ పాఠశాల పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వేసవి కాలంలో వచ్చే వ్యాధుల నుంచి కాపాడాలన్నారు. ప్రతి ఆరోగ్య కార్యకర్త గర్భిణులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి రిజిస్టర్‌ చేసిన వారికి సకాలంలో సేవలందించాలన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి సరైన చికిత్సను అందిస్తే మాత మరణాలను నివారించవచ్చన్నారు. ఐదేళ్ల లోపు బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి న్యూట్రిషన్‌ రీహాబిటేషన్‌ సెంటర్‌కు సిఫారసు చేస్తే శిశు మరణాలను నివారించ వచ్చన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు నిర్దేశించిన అన్ని టీకాలను సకాలంలో వేసి వారి వివరాలను యువిఇన్‌ యాప్‌, ఆర్‌సిహెచ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయా లని ఆదే శించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివే పిల్లలకు రాష్ట్ర బాల సురక్ష కార్యక్రమం ద్వారా పరీక్షలు నిర్వహించాలన్నారు. 2025 ఏప్రిల్‌ 1 నుంచి ముఖ ఛాయా చిత్రం ద్వారా హాజరును అమలు చేస్తామని తెలిపారు. వేసవికాలంలో వడదెబ్బ నివారణకు ప్రజలకు అవగాహనా కల్పించాలన్నారు. ఒఆర్‌ఎస్‌ తయారీపై ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతి పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లో ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. అభ ఐడి 100 శాతం అమలు చేయాలన్నారు. గిరిజన ప్రాంతాలలో సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధితో బాధపడుచున్న వారికి సకాలంలో చికిత్సన అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ పి. పద్మజ, డిపిఎంఒ డాక్టర్‌ సౌజన్య, డాక్టర్‌ వాణిశ్రీ, డాక్టర్‌ శ్రీవాణి. డాక్టర్‌ శ్రవణ్‌, డాక్టర్‌ హేమంత్‌, డేటా మేనేజర్‌ చల్లా ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️