గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి చేయగా తీవ్రంగా గాయపడిన సంఘటన యర్రగొండపాలెం మండలంలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో గల ఇష్టకామేశ్వరి ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో శనివారం సాయంత్రం జరిగింది. గాంధీ నగర్‌ చెంచు గూడేనికి చెందిన కుడుముల బయన్న అనే గిరిజనుడు అటవీ ఫల సేకరణ నిమిత్తం ఇష్టకామేశ్వరి సమీపం లోని అభయారణ్యంలోకి వెళ్లాడు. ఫలసేకరణ నిమిత్తం చెట్లను వెతుకుతుండగా అకస్మాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్రంగా గాయపరిచింది. ఇష్టకామేశ్వరి చెంచుగూడెం గిరిజనుల ద్వారా విషయం తెలుసుకున్న గాంధీ నగర్‌కు చెందిన చెంచులు క్షతగాత్రుడిని నంద్యాల జిల్లా సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్సలు అందించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌ వైద్యశాలకు తరలిస్తామన్నారని గిరిజనులు తెలిపారు.

➡️