స్టెమ్‌సెల్‌ దాతలుగా మారాలి

స్టెమ్‌సెల్‌ దాతలుగా మారాలి

విశాఖ ఎంపీ శ్రీభరత్‌

ప్రజాశక్తి -మధురవాడ :బ్లడ్‌ కేన్సర్‌, రక్తహీనత వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వారికి కొత్త జీవితం ఇవ్వడానికి, ప్రాణదాతలుగా మారడానికి ఆరోగ్యకరమైన వ్యక్తులు స్టెమ్‌సెల్‌ (మూలకణం) దాతలుగా ముందుకు రావాలని విశాఖ ఎంపీ ఎమ్‌.శ్రీభరత్‌ పిలుపునిచ్చారు. బుధవారం గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి (జిమ్‌సర్‌)లో దేశంలో స్టెమ్‌సెల్‌ దాతల వివరాలను నమోదు చేసే అతి పెద్ద స్వచ్ఛంద సంస్థ ‘ధాత్రి బ్లడ్‌ స్టెమ్‌సెల్‌ డోనర్స్‌ రిజిస్ట్రి’ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ,. ఆపదలో ఉన్నవారిని ఆదుకుని, ప్రాణం పోసే అరుదైన అవకాశం వదులుకోవద్దనికోరారు. స్టెమ్‌సెల్‌ అవసరం ఉన్న వారి సంఖ్య కంటే దాతల సంఖ్య దేశంలో అతి తక్కువగా ఉండటం విచారకరమన్నారు. గీతం విద్యార్ధులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి దాతలుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ధాత్రి సంస్థ ద్వారా స్టెమ్‌సెల్‌ దాతగా మారుతూ, తన వివరాలను నమోదు చేయించుకున్నారు. న్యూఢిల్లీకి చెందిన అర్పిత్‌జైన్‌ అనే యువకుడికి బ్లడ్‌ స్టెమ్‌సెల్‌ దానం చేసి ప్రాణాలు నిలిపిన విశాఖ యువకుడు గణపతిరావును అభినందించి జ్ఞాపికను అందజేశారు. ధాత్రి సంస్థ దక్షిణ భారత విభాగం అధిపతి అభరు శ్యామ్‌జాన్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 33 మిలియన్ల మంది స్టెమ్‌ సెల్‌ దాతలు ఉండగా, దేశంలో కేవలం 6 లక్షల మంది దాతలు మాత్రమే ఉన్నారన్నారు. 2007లో ప్రారంభమైన తమ సంస్థలో ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల నుంచి 5.6 లక్షల మంది, విశాఖ నుంచి 500 వందల మంది స్టెమ్‌సెల్‌ దాతలుగా పేర్లు నమోదుచేయించుకున్నారని తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల ఆరోగ్యవంతులు ఎవరైనా దాతలుగా మారవచ్చునని వెల్లడిరచారు. విశాఖకు చెందిన ప్రముఖ జాతీయ క్రికెట్‌ క్రీడాకారుడు కె.ఎస్‌.భరత్‌ ధాత్రి సంస్థ సేవా భావాన్ని కొనియాడారు. సంస్థ దాతలలో ఒకడిగా ఉంటానని ముందుకు వచ్చారు. జిమ్‌సర్‌ ప్రోవైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ బి.గీతాంజలి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌, జిమ్‌సర్‌ డిన్‌ డాక్టర్‌ ఎస్‌.పి.రావు, ధాత్రి సంస్థ ప్రతినిధులు రాణా పాల్గొన్నారు.

➡️