ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : బకాయి జీతాలను చెల్లించాలని కోరుతూ ఎంజిఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ కార్మికులు మంగళవారం భిక్షాటన చేపట్టారు. సెవెన్ హిల్స్ హాస్పిటల్ నుంచి జగదాంబ జంక్షన్ వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విశాఖ హాస్పిటల్, నర్సింగ్ హోమ్స్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి వై.రాజు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సమయంలో ఎంజిఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం కక్షపూరితంగా కార్మికుల జీతాలను ఆపివేసిందని విమర్శించారు. లేబర్ ఆఫీసర్ నోటీసులు పంపించినప్పటికీ స్పందించకుండా అమానవీయంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ జీతం తీసుకుంటూ, ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యవసర సరుకుల భారాలతో జీవనం సాగిస్తున్న కార్మికులు పండుగ పూట భిక్షాటన చేసుకునే దుస్థితికి హాస్పటల్ యాజమాన్యం తీసుకొచ్చిందని విమర్శించారు. సమస్యను వెంటనే పరిష్కరించి కార్మికులకు రావాల్సిన జీతాలు చెల్లించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజలు స్పందించి విరివిగా విరాళాలు ఇచ్చి తమ ఉద్యమానికి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సిహెచ్.నూకరాజు, పుష్ప, తిలోమని, వెంకటలక్ష్మి, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
![7 hill workers begging](https://prajasakti.com/wp-content/uploads/2025/01/1-7-hills.jpg)