ఏరియా వైద్యశాలలో మెరుగైన వసతులు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ ఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. శనివారం ఆయన యర్రగొండ పాలెంలోని ఏరియా వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. నవజాత శిశుసెంటర్‌ను సందర్శించారు. అన్ని వార్డులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ వైద్యనిపుణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది తక్కువగా ఉంటే భర్తీ చేస్తామన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యశాలపై మరింత విశ్వాసం పెరిగేలా వైద్యసేవలు అందించాలని చెప్పారు. ఆసుపత్రిలో డైట్స్‌, శానిటేషన్‌, మందుల కొరత లేకుండా చూడాలని తెలిపారు. ఏ ఒక్క రోగి కూడా బయట మందులు కొనుగోలు చేయవద్దని చెప్పారు. నిరుపేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందాలన్నారు. యర్రగొండపాలెంలోని ఏరియా వైద్యశాలకు 50 బెడ్‌లు మంజూరైనట్లు తెలిపారు. 5 డయాలసిస్‌ యూనిట్లు మంజూరు అయినట్లు తెలిపారు. వాటిని వేగవంతంగా ఆసుపత్రిలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఐసియు, డిహెచ్‌టియు యూనిట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. కంటి, ఎముకల విభాగాలు, ప్రసూతి, జనరల్‌ ఆపరేషన్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఏరియా వైద్యశాలలో శానిటేషన్‌ వర్కర్లు, ఆయమ్మలు తక్కువగా ఉన్నారని తెలపడంతో విషయాన్ని ఫోన్‌ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంజూరు చేస్తామని ఉన్నతాధికారులు తెలిపినట్లు తెలిపారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవరయాదిద్య, వైద్యనిపుణులు డాక్టర్‌ భాస్కర్‌రావు, డాక్టర్‌ నాగభూషణం, డాక్టర్‌ రవిచంద్ర, డాక్టర్‌ కృష్ణారెడ్డి, డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డాక్టర్‌ వినరు, హెడ్‌నర్స్‌ పి మినిజోష్‌తోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

➡️