బలితీసుకున్న బెట్టింగులు

Mar 20,2025 00:35

ఉరికి వేళ్లాడుతున్న యువకుని మృతదేహం
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
బెట్టింగ్‌ యాప్‌ల వలలో చిక్కుకున్న యువకుడు చివరికి ఉరేసుకున్నాడు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బుధవారం వెలుగు చూసిన ఘటనపై పోలీసుల వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం ఎస్‌ఎల్‌ గుడిపాడు గ్రామానికి చెందిన బండ్ల హనుమంతరావు (26)కు నరసరావుపేట మండలం పమిడిమర్రుకు చెందిన యువతితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్న హనుమంతరావు ఇటీవల ఆ ఉద్యోగం చేయలేనని చెప్పి స్వగ్రామమైన ఎస్‌ఎల్‌ గుడిపాడుకు వచ్చాడు. మంగళవారం తన భార్యను తీసుకుని పమిడిమర్రుకు వచ్చాడు. అనంతరం తాను హైదరాబాదు వెళ్తుతన్నాని చెప్పి నరసరావుపేటకు వచ్చాడు. ఇక్కడే వినుకొండ రోడ్డులోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 11 గంటలకు లాడ్జీ నిర్వాహకులు గది వద్దకు వెళ్లి ఎంత పిలిచినా బదులు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి తలుపులు పగలగొట్టి చూడగా గదిలో ఉరికి హనుమంతరావు మృతదేహం వేళ్లాడుతోంది. దీంతో మృతుని కుటుంబీకులకు పోలీసులు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానియ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మరోవైపు భర్త మృతి వార్త తెలుసుకున్న భార్య తానూ ఆత్మహత్యాయత్నం చేశారు.

➡️