బెట్టింగుల జోరు

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగులు జోరందుకున్నాయి. కడప, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పందేలు కాస్తుండడం పతాక స్థాయికి చేరుకుంది. ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపోటములు, ప్రభుత్వ మార్పు, పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సాధించబోయే మెజార్టీలపై పందెం రాయుళ్లు బెట్టింగులు కాస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఉభయ జిల్లాల వ్యాప్తంగా బెట్టింగుల రూపంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ప్రజాశక్తి – కడప ప్రతినిధి కడప, అన్నమయ్య జిల్లాల్లో బెట్టింగులజోరు కొనసాగుతోంది. కడప పార్లమెంట్‌ పరిధిలోని ఏడు, రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్న సంగతి తెలిసిందే. కడప జిల్లాలోని కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని రాజంపేట, రాయచోటి నియోజకవర్గ బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపోటములపై పందేలు పెద్దఎత్తున పందేలు కాస్తున్నారు. కడప, కమలాపురం, ప్రొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థుల విజయావకాశాలపై రూ.లక్ష చొప్పున పందేలు కాస్తున్నారు. కడప అసెంబ్లీ అభ్యర్థుల విజయావకాశాలపై ఎన్నికల ప్రచారాల సమయంలోనే పందేలు కాయడం తెలిసిందే. జిల్లాలోని గట్టి పోటీ నెలకొన్న కమలాపురం, ప్రొద్దుటూరు, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట నియోజకవర్గాల్లో పెద్దఎత్తున పందేలు కాస్తుండడం చర్చనీయాంశంగా మారింది. రాయచోటి అసెంబ్లీ పరిధిలోని ఓ మండలంలో రూ.10 లక్షల చొప్పున పందేలకు దిగారు. పోలింగ్‌ అనంతరం ఓటింగ్‌ సరళి, మహిళలు, వృద్ధులు పెద్దఎత్తున పోటెత్తిన నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్ష టిడిపికి పడే అవకాశం ఉందని, అధికార వైసిపి వృద్ధులు, మహిళలకు అందించిన సంక్షేమ పథకాల కారణంగా పాజిటివ్‌ ఓటు పడిందని అంచనాలతో పెద్దఎత్తున పందేలు కాస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.జగన్‌ మెజార్టీపైనా బెట్టింగులు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ పులివెందుల నియోజకవర్గంలో సాధించబోయే మెజార్టీపైనా పెద్దఎత్తున పందేలు కాస్తుండడం గమనార్హం. కుప్పంలో నారా చంద్రబా బునాయుడు, పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌, మంగళ గిరిలో నారా లోకేష్‌ మెజార్టీలపై బెట్టింగులు కాస్తున్నారు. రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలకు చెందిన పలు అసెంబ్లీల తరుపున బరిలో నిలిచిన ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల గెలుపోటములపై పందేలకు సిద్ధ పడుతున్నారు. సదరు అభ్యర్థులు సాధించబోయే మెజార్టీలను, పులివెందుల మెజార్టీతో పోల్చి కోట్లాది రూపాయలతో కూడిన బెట్టింగులకు పాల్పడడం మూర్ఖత్వమా లేక తెంపరితనమా అనేది తెలియడం లేదని చెప్పవచ్చు. కడప పార్లమెంట్‌ వైసిపి అభ్యర్థి అవినాష్‌రెడ్డి గెలుపోటములపై వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ అను కూలురు ఎవరు బెట్టింగులకు పాల్పడకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.ప్రభుత్వ మార్పుపైనా పందేలు జిల్లాల్లోని అసెంబ్లీ అభ్యర్థుల గెలుపోటములపై పందేలు కాయడం వరకు బాగానే ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మార్పుపైనా పెద్దఎత్తున పందేలు కాస్తుండడం గమనార్హం. ఒక్కొక్కరు పరస్పరం రూ.లక్షకు రూ.లక్షన్నర చొప్పున పందేలు కాస్తుడడం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రతిపక్ష టిడిపి అనుకూలురు ప్రభుత్వం మారు తుందనే పేరుతో రూ.లక్ష పెడితే ప్రత్యర్థులు రూ. లక్షన్నర పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈలెక్కన ఉభయ జిల్లాల వ్యాప్తంగా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. కడప, రాజంపేట అసెంబ్లీల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంందనే గుడ్డి అంచనాలతో పందేలకు దిగు తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈలెక్కన జూన్‌ నాలుగవ తేదీ కౌంటింగ్‌ సమయానికి ఎందరు ఆస్తులను పోగొట్టుకుని, అప్పుల పాలవుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాన్ని ఊహించి వర్తమానంలో పందేలు కాస్తుండడం వెర్రితనమనే సంగతిని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

➡️