భగ్గుమన్న ఫ్యాక్షన్‌ గొడవలు

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఫ్యాకక్షన్‌ గొడవలు భగ్గుమన్నాయి. పొలం విషయంపై ఇరు పార్టీలకు చెందిన నాయకులు వాదోపవాదాలకు దిగి చివరకు కత్తులు, గొడ్డలితో దాడి చేసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్ద దండ్లూరు గ్రా మంలో చోటు చేసుకోవడంతో గ్రామంలోని ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పొలం తగాదా విషయంపై వైసిపి నాయకులు, కూటమి నాయకులు ఘర్షణకు పాల్పాడ్డారు. ఈ ఘర్షణలో దాదాపు 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల మేరకు.. బుధవారం పెద్దండూరు గ్రామంలోని ఇరు గ్రూపులకు చెందినవారు పొలం విషయంలో ఘర్షణ పడ్డారు. ఇందులో కూటమి మద్దతుదారులైన నడిపి ఎల్లారెడ్డి, గురివిరెడ్డి రామాంజనీయ రెడ్డి, పెద్ద తిమ్మన్నతోపాటు వైస ిపికి చెందిన హనుమంత రెడ్డి, గురివిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఎల్లారెడ్డి, సుధాకర్‌ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో హనుమంత్‌ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్ధిజెప్పి గాయపడిన వారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మూలే సుధీర్‌రెడ్డి జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలోని బాధితులను పరామర్శి ంచారు. అటు కూటమి నాయ కులు కూడా వారి తరపు బాధితులను పరా మర్శించారు. ఎమ్మెల్సీ గ్రూపునకు చెందిన హను మంతరెడ్డి, రామనాథరెడ్డి తీవ్రంగా గాయపడడంతో వారిని ప్రొద్దుటూరు ఆస్పత్రికి, మరికొందరిని మె రుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు వైద్యులు తరలించారు. ఘర్షణకు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్యాక్షన్‌ నియోజకవర్గమైన జమ్మలమడుగులో పోలీసులు అప్రమత్తంగా లేకుంటే గొడవలు జరుగుతూనే ఉంటాయని మాజీ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన హనుమంత రెడ్డిపై రెండు నెలల కిందట జమ్మలమడుగు కోర్టు ముందు దాడి జరిగిందని పేర్కొన్నారు. అప్పుడే నిందితులను కఠినంగా శిక్షించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

➡️