ప్రజాశక్తి – పిఠాపురం : ఇసుకను ఉచితంగా ఇస్తామంటూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణ అమలు చేయాలని కోరుతూ అక్టోబర్ 4వ తేదీన జరిగే ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని భవన నిర్మాణకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ ఈశ్వరరావు కార్మికులకు పిలుపునిచ్చారు.మంగళవారం రాపర్తి రోడ్డులోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈశ్వరరావు,కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇసుక సమస్యను పరిష్కరించి ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు వంద రోజులు దాటిన కూడా ఇసుక సరఫరా చేయడంలో విఫలమైందని విమర్శించారు.ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఎక్కడ నిర్మాణాలు అక్కడ నిలిచిపోయాయని తద్వారా భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.లారీ ఇసుక రూ50 వేలు ఈరోజున మార్కెట్లో ఉన్నదని ఈ ప్రభుత్వం చెప్పిన మాటలకి ఇసుక ధరలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు.ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని,భవనర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని,నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలనే డిమాండ్లతో అక్టోబర్ 4వ తేదీన మండల కేంద్రాల్లో నిర్వహించే ధర్నా కార్యక్రమాల్లో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు డి సత్యనారాయణ,కె చిన్న,వి ఎస్ రెడ్డి,కోనేటి రాజు, కె రమణ,జి వీరబాబు,సూర్య చక్రం,నాగ శ్రీనివాస్,కె విశ్వనాథంఎస్ సత్తిబాబు,కె శ్రీను, మోహనాచార్యులు,సత్తిబాబు,కృష్ణ,గోపాలకృష్ణ,సూరిబాబు.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.