Accident – ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్‌ – యువకుడు మృతి

ప్రజాశక్తి-బూర్జ (శ్రీకాకుళం) : రోడ్డుపై ఆగి ఉన్న లారీని బైకు ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలంలో జరిగింది. మండలంలోని అయ్యవారిపేట గ్రామానికి చెందిన చోడవరపు లక్ష్మణుడు, సూర్యం దంపతుల ఏకైక కుమారుడు చోడవరపు భార్గవ్‌ కుమార్‌ పైడి భీమవరంలోని రెడ్డీస్‌ కంపెనీ లో అప్రెంటిస్‌ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నాడు. మరికొద్ది నెలల్లో జాబ్‌ పర్మినెంట్‌ కానుంది. భార్గవ్‌ ప్రతిరోజు ఉద్యోగం నిమిత్తం తన సొంత గ్రామమైన అయ్యవారిపేట నుండి శ్రీకాకుళంకు బైక్‌పై వెళుతుండేవాడు. అలాగే ఈరోజు కూడా ఉదయం 5 గంటలకు తన ఇంటి నుండి బైక్‌పై బయలుదేరుతూ తల్లిదండ్రులకు వెళ్లి వస్తా అని చెప్పాడు. మండలంలోని సింగన్నపాలెం గ్రామం వద్ద మరమ్మతుకు గురైన భారీ లారీ రోడ్డు పక్కన ఆగి ఉంది. భార్గవ్‌ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆ లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో భార్గవ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భార్గవ్‌ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అంది వచ్చిన కొడుకు అనంత లోకాలకు….
తల్లిదండ్రులు భార్గవ్‌ కుమార్‌ను ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా ప్రయోజకుడైన కొడుకు భార్గవ్‌ పైడి భీమవరంలోని రెడ్డీస్‌ కంపెనీ లో అప్రెంటిస్‌ ఇంజనీర్‌ గా జాయిన్‌ అయ్యాడు. మరికొద్ది నెలలో జాబ్‌ పర్మినెంట్‌ అవుతుంది. అమ్మానాన్నలను ఇంకా బాగా చూసుకోవచ్చు అన్న ఆశతో భార్గవ్‌ ప్రతిరోజు తన సొంత గ్రామం అయ్యవారిపేట నుండి శ్రీకాకుళంకు బైక్‌ పై వెళ్లి వస్తుండేవాడు. హఠాత్తుగా ప్రమాదం జరిగి కుమారుడు మరణించడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. డ్యూటీకి వెళ్ళిన కొడుకు సాయంత్రం కల్లా ఇంటికి వస్తాడని అనుకున్న తాము కుమారుడి మరణవార్త వినాల్సి వచ్చిందంటూ ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ ఘటనతో గ్రామమంతా విషాదంలో మునిగింది.

రోడ్డుపై ఆగి ఉన్న లారీనే యమపాశమయ్యింది : గ్రామస్తులు
గ్రామస్తులు మాట్లాడుతూ … భార్గవ్‌ క్రమశిక్షణతో మెలిగి ప్రయోజకుడై ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడని చెప్పారు. చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా ఉండేవాడని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పేవాడని అన్నారు. అనుకున్న విధంగానే మంచి ఉద్యోగాన్ని సంపాదించాడని ఇంతలోనే … ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై ఆగి ఉన్న లారీనే భార్గవ్‌ పట్ల యమపాశమయ్యిందని కంటతడిపెట్టారు.

➡️