గిరిజనులకు బైండోవర్‌ నోటీసులు దారుణం

గిరిజనులకు బైండోవర్‌ నోటీసులు దారుణం

ఐటిడిఎలో వినతిపత్రం అందజేసిన ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు

ప్రజాశక్తి – ఎటపాక : ఏజెన్సీలో గిరిజనులకు ఎటపాక మండల తహశీల్దార్‌ బైండోవర్‌ నోటీసులు ఇవ్వడం దారుణమని ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కాకా అర్జున్‌దొర, ఇరప అజరుకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బుధవారం ఐటిడిఎ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ, ప్రయివేటు ఖాళీ స్థలాలను ఆక్రమించుకుని గిరిజన, గిరిజనేతరుల మధ్య వివాదాలకు కారణమౌతున్నారని, మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని పేర్కొంటూ బుధవారం తహశీల్దార్‌ కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని కొందరు గిరిజనులకు స్థానిక తహశీల్దార్‌ నోటీసులు ఇచ్చారు. రూ.60వేలు, ఇద్దరు పూచీకత్తుతో, ఆరునెలల బైండోవర్‌ చేయడంపై ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాజకీయ ప్రోద్బలంతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ గిరిజనులకు నోటీసులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. దశాబ్దాలుగా గిరిజన, గిరిజనేతరుల మధ్య వివాదాలు లేవని, సామరస్యంగా మెలుగుతున్న వారి మధ్య కొందరు వైషమ్యాలు సష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులకు బైండోవర్‌ నోటీసులపై న్యాయ పోరాటం చేస్తామని, జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ, రాష్ట్ర ట్రైబల్‌ కమిషన్లకు, జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తున్నామన్నారు. ఐటిడిఎలో వినతిపత్రం అందించిన వారిలో ఆదివాసీ గిరిజన సంఘం ఎటపాక మండల నాయకులు సోందె రామారావు, కురసం రాజశేఖర్‌, తెల్లం నవీన్‌, సున్నం రామకష్ణ, తెల్లం చిన్న నారాయణ, నల్లకుంట ఉపసర్పంచ్‌ గుండికోటేశ్వరరావు వున్నారు.

ఆందోళన చేస్తున్న ఆదివాసీ గిరిజన సంఘం నేతలు

➡️