రూ.కోట్లకు బిస్కెట్‌!

Apr 25,2025 00:37

రాజేష్‌ జారీ చేసిన ఐపి నోటీసుల్లో కొంతభాగం
ప్రజాశక్తి-పిడుగురాళ్ల :
తక్కువ ధరకే బంగారపు బిస్కెట్‌ వస్తుందని ఆశచూపి రూ.కోట్లు దండుకుని పరారయ్యాడో ప్రభుద్ధుడు. పట్టణంలో ఇటీవల పెరుమాళ్ల రాజేష్‌ అనే మిర్చి వ్యాపారి తనకు దుబారులో బంగారం వ్యాపారం ఉందని, అక్కడ నుండి తనకు తక్కువ ధరకే బంగారు వస్తుందని, కావాలంటే మీరు కూడా పెట్టుబడి పెట్టవచ్చునని నమ్మబలికాడు. బంగారు బిస్కెట్‌ ధర ఇక్కడ రూ.8 లక్షలుంటే తనకు రూ.7.5 లక్షలకు వస్తుందంటూ తనకు సన్నిహతంగా ఉండే కొందరితో పెట్టుబడి పెట్టించాడు. వారికి కొంత లాభాలు చూపించడంతోపాటు పట్టణంలోని కొన్ని దేవాలయాల్లో విరివిగా విరాళాలు ప్రకటించడం, రాజకీయ పార్టీలకు డబ్బులు ఇవ్వడం, క్రీడలకు బహమతులు అందివ్వడం వంటివి చేశాడు. దీంతో అతని మాటలను నమ్మిన కొందరు రూ.కోట్లలో డబ్బులు పెట్టుబడిగా ముట్టజెప్పారు. అందరి దగ్గరా డబ్బులు తీసుకున్న రాజేష్‌ కొద్ది రోజుల క్రితం పరారయ్యాడు. కొద్ది రోజుల తర్వాత… తాను ఎక్కడికీ వెళ్లలేదని, అందుబాటులోనే ఉన్నానని, డబ్బులు హవాలలో ఆగిపోయాయని, త్వరలోనే మీ డబ్బులు మీకు ఇస్తానని వాట్సప్‌ ద్వారా వాయిస్‌ మెసెజ్‌ పంపాడు. అయితే బాధితులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. పెరుమాళ్ల రాజేష్‌ను పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని భావించగా ఈనెల 12న పెరుమాళ్ల రాజేష్‌ 66 మందికి రూ.26.66 కోట్లకు సంబంధించి ఐపి నోటీసులు పంపిచాడు. పెరుమాళ్ల రాజేష్‌కు డబ్బు ఇచ్చినట్లు ఆధారాలేమీ లేకుండానే చాలామంది పెట్టుబడులు పెట్టారు. వీరంతా ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు దుబారు నుండి బంగారు బిస్కెట్లు తీసుకురావడం బూటకమని, విజయవాడ నుండే కోనుగోలు చేసి ఇక్కడ కొంతమందికి ఆశ చూపి రూ.కోట్లు కొల్లుకొట్టాడని స్థానికులు కొందరు చెబుతున్నారు. ఈ మోసంలో రాజేష్‌కు ఒక ఫైనాన్స్‌ సంస్థ నిర్వాహకుడూ సహకరించినట్లు స్ధానికులు ఆరోపిస్తున్నారు. పెరుమాళ్ల రాజేష్‌ కనిపించకుండా వెళ్లే ముందు ఫిబ్రవరి 28న స్థానిక డిబిఎస్‌ బ్యాంకులో ఫైనాన్స్‌ వ్యాపారికి రెండు గోతాల వెండి ఆభరణాలు ఇచ్చాడని, ఆ విషయం పోలీసులకు తెలిసి బ్యాంకుకు వెళ్లి విచారణ చేయగా రెండు సంచులను ఫైనాన్స్‌ వ్యాపారికి రాజేష్‌ ఇచ్చినట్లుగా సిసి కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. పోలీసులు సదరు ఫైనాన్స్‌ వ్యాపారిని పిలిచి విచారణ చేయగా.. రాజేష్‌ తనకు ఆభరణాలు ఇచ్చిన మాట నిజమేనని, తనకు డబ్బు ఇవ్వాల్సి ఉండి ఆ బ్యాంకులో ఆభరణాలు ఇచ్చి వెళ్లాడని చెప్పాడు. కాని పోలీసుల విచారణకు ముందు సదరు ఫైనాన్స్‌ వ్యాపారి తనకేమీ తెలియనట్లుగా రాజేష్‌ వెళ్లినప్పుటి నుండి భాదితులతో ‘నేను మీకు అండగా ఉంటా’ అంటూ అందిరితో మీటింగ్‌లు ఏర్పాటు చేసి రాజేష్‌తో మాట్లడిస్తానని చెప్పడం, భాదితులను తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయించడం వంటివి చేశాడు. రాజేష్‌కు చెందిన స్థలాలు, కారు, ఆఫీస్‌ అన్నీ ఫైనాన్స్‌ వ్యాపారి ఆధీనంలో ఉన్నాయని, భాదితులకు డబ్బులు ఇప్పిస్తానని చెప్పాడు. ఇందుకుగాను రూ.కోటికి రూ.లక్ష చొప్పున వసూలు చేసినట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫైనాన్స్‌ వ్యాపారిని పోలీసులు తొలిదశలోనే విచారణ చేస్తే రాజేష్‌ గురించి సమాచారం తెలిసేదని, అయితే ఆ వ్యాపారికి రాజకీయ అండదండలు ఉండటంతో పోలీసులు చూసి చూడనుట్లు వదిలేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా బంగారు బిస్కెట్ల్‌ పేరుతో మోసం చేసిన రాజేష్‌ చివరికి మిర్చి వ్యాపారంలో నష్టం వచ్చిందంటూ భాధితులకు ఐపి నోటీసులు ఇవ్వడం గమనార్హం.పిడుగురాళ్లలో ఐటి దాడుల భయంమరోవైపు పిడుగురాళ్లలో పలువురికి ఐటి దాడుల భయం పట్టుకుంది. పెరుమాళ్ల రాజేష్‌ నుండి ఐపి నోటీసులు వచ్చినప్పటి నుండి పిడుగురాళ్లలో రూ.కోట్లు ఎలా ఇచ్చారు? వారికి అంత డబ్బు ఎలా వచ్చింది? అనే అనుమానాలు వాస్తున్నాయి. వీరందరిపైనా ఐటి అధికారులు దృష్టి పడితే తనిఖీలు చేస్తారేమోనని కంగారుగా బెంబేలెత్తిపోతున్నారు.

➡️