ప్రజాశక్తి – కడప : భారతీయ జనతా పార్టీ కుట్రలు పన్నుతూ రాజకీయం పేరుతో చట్టాలను దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి.విజయ జ్యోతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై చార్జ్ షీట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ … బుధవారం విజయ జ్యోతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి మాట్లాడుతూ … భారతదేశ ప్రజాస్వామ్యానికి అవమానంగా, రాజకీయం పేరుతో చట్టాలను ముసుగు చేసుకుని ప్రతిపక్ష నాయకులపై దాడులు కొనసాగుతున్నాయి అన్నారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేషనల్ హెరాల్డ్ కేసులో శ్రీమతి సోనియా గాంధీ ( ఏ1), లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ ( ఏ2)లపై చార్జ్ షీట్ దాఖలు చేయడం పట్ల భారత జాతీయ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అన్నారు.ఈ కేసు పూర్వాపరాల గురించి ఓసారి పరిశీలిస్తే ఇది పూర్తిగా రాజకీయంగా ప్రేరేపితమైనదని స్పష్టమవుతుంది అన్నారు. నేషనల్ హెరాల్డ్ అనేది స్వాతంత్య్ర సమరయోధులు స్థాపించిన వార్తాపత్రిక, దీని నిర్వహణకు నాన్-ప్రాఫిట్ సంస్థగా ”యంగ్ ఇండియా” ఏర్పడింది అన్నారు. ఇందులోని ఆర్థిక లావాదేవీల్లో ఎలాంటి అక్రమం జరగలేదని ఇప్పటికే పలు విచారణల్లో తేలింది అన్నారు. అయినా ఆర్ధిక నేర నిరోధక సంస్థను (ఈడి) బిజెపి ప్రభుత్వం రాజకీయ రీత్యా దుర్వినియోగం చేస్తోంది అని మండిపడ్డారు.ఈ చర్యలు పూర్తిగా కాంగ్రెస్ నాయకులను కలుషితపరచాలనే కుట్ర పూరితంగా సాగుతున్నాయి అని తెలిపారు. ఈ చర్యలు చట్టపరమైన అవసరంతో కాకుండా, రాజకీయ ప్రతీకారంతో నడిపిస్తున్న దాడులుగా పరిగణించాలి అన్నారు.ఇది ప్రజాస్వామ్యంపై దాడి, స్వేచ్ఛాయుత భావప్రకటనపై మచ్చలేసే చర్య. ప్రజలకు అర్థమయ్యేలా ఈ కుట్రలను వెలుగులోకి తీసుకురావాలి అన్నారు. అధికార బిజెపి తన రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి, విచారణ సంస్థలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటోంది, ఇది రాజ్యాంగ పరిపాలనకు విరుద్ధం అని అన్నారు. ఈ రాజకీయ ప్రతీకార ధోరణులు ప్రజల ముందే కూలిపోతాయి. భారత రాజ్యాంగం ముందు అందరూ సమానమే. ప్రజలు నిజాన్ని గుర్తించి భవిష్యత్లో తగిన బుద్ధి చెబుతారు అని విజయ జ్యోతి స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి పటాన్ మహమ్మద్ అలీ ఖాన్, ప్రొద్దుటూరు, కమలాపురం అసెంబ్లీ సమన్వయకర్త ఇర్ఫాన్ భాష, అశోక్ కుమార్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజరు కుమార్ మూరతోటి, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిళ్ళ బాబు, రహమతుల్లా ఖాన్, షేక్ నీలం, ముబారక్ భాషా, పఠాన్ ఖాదర్ ఖాన్, సయ్యద్ ఖాజా మైనుద్దీన్, రఫిక్ మొహిద్దిన్ ఖాన్, కమల్ భాష, చిన్న కుల్లాయప్ప, సంజరు కాంత, సయ్యద్ గౌస్ పీర్, పాలెం హరిప్రసాద్, సిరాజుద్దీన్, కదిరి ప్రసాద్ గౌడ్, అబ్దుల్ సత్తార్, గద్దె సునీత, సిద్ధిక్, సద్దాం, శివారెడ్డి పాల్గొన్నారు.
బిజెపి కుట్రలు – రాజకీయం పేరుతో చట్టాల దుర్వినియోగం : కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి
