భారీ వాహనాలకు అడ్డుకట్టేదీ?

అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డులో అధిక లోడ్‌తో వెళ్తున్న లారీ

ప్రజాశక్తి-మునగపాక

అనకాపల్లి-అచ్యుతాపురం రహదారిలో భారీ వాహనాలకు అడ్డుకట్ట పడలేదు. ఈ మార్గంలో పెట్టిన హెచ్చరిక బోర్డులను బేఖాతరు చేస్తూ దర్జాగా భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. అయినా ఏ ఒక్క అధికారీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎస్‌ఇజెడ్‌ కంపెనీల వాహనాలు, భారీ వాహనాలతో అధ్వానంగా మారిన అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డులో తరచూ ప్రమాదాలు జరిగేవి. ఈ రోడ్డును పునర్నిర్మాణం చేయాలని సిపిఎం, అఖిలపక్ష, ప్రజాసంఘాలు చేసిన ఐక్య పోరాట ఫలితంగా ఇటీవల రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. రోడ్డు నిర్మాణం జరిగిందే తప్ప ఈ మార్గంలో భారీ వాహనాలను కట్టడి చేసే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అనకాపల్లి- అచ్యుతాపురం మార్గంలో రోడ్డుకు ఆనుకొని ఇరువైపులా పంట కాలవలు ఉండటంతో 20 టన్నుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలు ప్రయాణిస్తే రోడ్డు బీటలు వారి త్వరగా శిధిలమవుతుందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. అయినా దానిని ఉల్లంఘించి 60 నుండి 70 టన్నుల సామర్థ్యం గల లోడుతో భారీ వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. అనకాపల్లి బైపాస్‌ జంక్షన్లో ఆర్‌ అండ్‌ బి అధికారుల పెట్టిన హెచ్చరిక బోర్డులు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. వాటిని వాహనదారులు బేఖాతరు చేస్తూ తమ పని తమదేనంటూ భారీ వాహనదారులు దూసుకుపోతున్నారు. దీని వల్ల ఈ రోడ్డు ధ్వంసమవుతుంది. అలాగే మునగపాక, హరిపాలెం గ్రామాలలో బ్రిటిష్‌ హయాంలో నిర్మించిన పురాతన బ్రిడ్జిలు కూడా శిథిలం కావడంతో వాటి మీదుగా అధిక లోడుతో వెళుతున్న వాహనాల మూలంగా ఆ బ్రిడ్జిలు కూలిపోయే ప్రమాదం కూడా ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి యథేచ్ఛగా తిరుగుతున్న భారీ వాహనాలను అరికట్టకపోతే పోరాడి సాధించుకున్న రోడ్డు మార్గం పూర్వ పరిస్థితి తప్పదని పలువురు ఆందోళన చెందుతున్నారు.

➡️