రక్తదానం చేస్తున్న విద్యార్థులు, యువకులు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, యువతకు ఆదర్శ మూర్తి అయిన సర్దార్ భగత్‌సింగ్ జయంతి సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని సీతారాం ఏచూరి ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పల్నాడు డిస్టెన్స్ అకాడమీ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరాన్ని పిడుగురాళ్ల పట్టణ సిఐ ఎస్.వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ ఒక నిప్పు కణికని, ఆయన్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. 23 ఏళ్ల వయస్సులోనే దేశ స్వాతంత్య్రం కోసం ఊరి కంబాన్ని ముద్దాడిన భగత్‌సింగ్ ‘నా దేహం కన్నా దేశం గొప్పది’ అని నినదించారని గుర్తు చేశారు. అతిచిన్న వయస్సులోనే బ్రిటీష్ వారిని గడగడలాడించిన యోధుడు భగత్‌సింగ్ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ కోటా సాయికుమార్ మాట్లాడుతూ పిడుగురాళ్ల పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు కోసం సాగే పోరాటంలో విద్యార్థులంతా కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో పిఎస్‌ఆర్ డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ కోనేటి నరసింహారావు, బడేసా మస్తాన్‌రావు, పల్నాడు డిస్టెన్స్ అకాడమీ డైరెక్టర్ శైలజ, ఎస్‌ఎఫ్‌ఐ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు రోహిత్, రామకృష్ణ, యాసీన్, విద్యార్థులు పాల్గొన్నారు.