రక్త పరీక్షలు తప్పనిసరి : డిఎంఒ

Jun 8,2024 21:34

ప్రజాశక్తి – గరుగుబిల్లి: క్షేత్ర స్థాయిలో జ్వర నిర్ధారణ పరీక్షలు మెరుగుపర్చాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు స్పష్టం చేశారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్‌ రికార్డులు తనిఖీ చేసి క్షేత్ర స్థాయిలో, ఆరోగ్య కేంద్రంలో సేకరించిన జ్వర నిర్దారణ పరీక్షలు ఏ మేరకు చేపడుతున్నారో నివేదికలు పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో రక్తపూతల సేకరణ (ఏక్టివ్‌ సర్వలెన్స్‌) పెంపొందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పిహెచ్‌సికి సీజనల్‌ జ్వర లక్షణాలతో ఎవరు వచ్చినా వెంటనే మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు జరపాలన్నారు. పిహెచ్‌సిలో మలేరియా నిర్ధారణకు మైక్రోస్కోప్‌ పరీక్షా పద్ధతి తప్పని సరి అని తెలిపారు. ఆసుపత్రిలో కుక్క, పాము కాటుల చికిత్స కొరకు అవసరమైన ఎఆర్‌వి, ఎఎన్‌సివి ఇంజక్షన్లు సిద్ధంగా ఉంచాలన్నారు. పిహెచ్‌సిలో సాధారణ ప్రసవాలు జరగాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు దోమల నియంత్రణ చర్యలు, డ్రైడే కార్యక్రమాలు చేపడుతూ సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ పరిశీలనలో వైద్యాధికారి డాక్టర్‌ ఎస్‌.సంతోష్‌ కుమార్‌, ఎఎంఒ సూర్యనారాయణ, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

➡️