ర(క్త)హదారులు

Feb 18,2025 01:31

చేబ్రోలు మండలంలో వద్ద ప్రమాద స్థలిలో మృతదేహాలు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రాజుపాలెం మండలం నెమలిపురి వద్ద ఆదివారం తెల్లవారుజామున కారును లారీ ట్యాంకర్‌ ఢకొీన్న ఘటనలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలీ, కుమారులు మృతి చెందారు. ఈ ఘటన మరవక ముందే నారాకోడూరు-బుడంపాడు మధ్య ఆటోను ఆర్‌టిసి బస్సు ఢకొీనడంతో ముగ్గురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ముప్పాళ్ల మండలం బొల్లవరం శివారు మాదల మేజర్‌ కాల్వ వద్ద ఈనెల 9వ తేదీ సాయంత్రం ట్రాక్టరు తిరగబడి నలుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. గత నెల 31వ తేదీ రాత్రి స్థానిక ఏటుకూరు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢకొీన్ని ముగ్గురు యువకులు మృతి చెందారు. గుంటూరులో ఆదివారం ఒక వృద్ధురాలు, ఒక యువకుడి వేర్వేరుగా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇలా రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. ఒకేసారి ముగ్గురు కంటే ఎక్కువ మంది మృతి చెందితేనే ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు కొంత వరకు స్పందిస్తున్నారు. ఒకరిద్దరు చనిపోతే పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ వినియోగించక పోవడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రహదారులు సరిగా ఉండకపోవడం, మద్యం మత్తులో డ్రైవింగ్‌, నిబందనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ వల్లకూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అతివేగం, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, నియంత్రణ లేకపోవడం, భారీ వాహనాలు కూడా వేగనియంత్రణ లేకపోవడం వల్ల ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. వేకువ జామున జరిగే ప్రమాదాల్లో మంచు, నిద్ర మత్తు సమస్యలు కూడా ప్రధాన కారణంగా నిలుస్తు న్నాయి. మృతులతో పాటు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల పాలైన పరిస్థితి దుర్భరంగా మారుతోంది. నెలల తరబడి మంచానికి పరిమితం కావాల్సి వస్తోంది. తద్వారా ఆర్థిక, మానసిక సమస్యలు ఎదురవుతున్నాయి. గుంటూరు జిల్లాలో 2023లో 413 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందితే 611 మంది గాయపడ్డారు. 2024లో 433 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందగా 865 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా 70 మంది వరకు గాయపడ్డారు. పల్నాడు జిల్లాలో గతేడాది 400 ప్రమాదాల్లో 360 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు. ప్రమాదాల్లో ఆప్తులను, కన్న వారిని, కట్టుకున్న వారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు మానసిక క్షోభకు గురవుతున్నాయి. ప్రమాదాల నివారణకు రవాణ, పోలీసు శాఖలు మరింత సమన్వ యంతో పనిచేయాల్సిన అవసరం ఉంది.

➡️